
సార్వత్రి ఎన్నికల్లో పలువురు సినిమా తారలు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, ప్రముఖ సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్‌కు బీజేపీ టికెట్లు కేటాయించింది. తాజాగా మరో నటికి బీజేపీ టికెట్ లభించింది. ఆమె మరెవరో కాదు గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన నవనీత్ కౌర్ రాణా.

సార్వత్రిక భాగంగా బుధవారం మరో రెండు లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది బీజేపీ. ఇందులో అమరావతి (మహారాష్ట్ర) నుండి సిట్టింగ్ స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణాకు బిజెపి టికెట్ ఇవ్వగా, కర్ణాటకలోని చిత్రదుర్గ నుండి సిట్టింగ్ ఎంపి కేంద్ర మంత్రి ఎ నారాయణస్వామి స్థానంలో గోవింద్ కార్జోల్‌ను అభ్యర్థిగా ప్రకటించారు.

నవనీత్ రాణా ప్రస్తుతం అమరావతి ఎంపీగా ఉన్నారు. 2019లో స్వతంత్ర అభ్యర్థిగా శివసేనకు చెందిన ఆనందరావు అద్సుల్‌పై విజయం సాధించారు

నవనీత్ కౌర్ టాలీవుడ్‌లో యమదొంగ, గుడ్ బాయ్, రూమ్‌మేట్స్, శీనువాసంతి లక్ష్మి, మహారథి, జాబిలమ్మ తదితర చిత్రాల్లో నటించింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది.

తనకు ఎంపీ అభ్యర్థిగా టికెట్ రావడంతో నవనీత్ రాణా హర్షం వ్యక్తం చేసింది .ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారామె. పార్టీ తనపై విశ్వాసం వ్యక్తం చేసిందని అది నిలబెట్టుకుంటానంటూ ధీమా వ్యక్తం చేసింది.