
మలయాళీ సినిమాలో బాలనటిగా సినీప్రయాణాన్ని ప్రారంభించింది హీరోయిన్ మంజిమా మోహన్. చాలా కాలం గ్యాప్ తర్వాత 2015లో వచ్చిన ఒరు వడక్కన్ సెల్ఫీ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది.

అయితే మంజిమా మోహన్ శరీర బరువుపై నిరంతరం సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. బాడీ షేమింగ్ కామెంట్స్ తన మానసిక పరిస్థితి పై ఎలాంటి ప్రభావం చూపించాయో వెల్లడించింది.

సినిమా నా జీవితంలో ఒక భాగం మాత్రమే. అవును, బరువు తగ్గడం వల్ల నాకు మరికొన్ని పాత్రలు వచ్చి ఉండేవి. కానీ అంతకు మించి... సినిమా వదిలిస్తే నేను ఎలా కనిపిస్తున్నానో ఎవరూ పట్టించుకోరు. నాకు తెరపై కనిపించడం కంటే ఎక్కువ లక్ష్యాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది.

శారీరకంగా, మానసికంగా చాలా కష్టమైన దశ.. బరువు తగ్గడానికి వైద్యులను కలిశాను. శస్త్రచికిత్స చేయించుకోవడానికి కూడా సిద్ధమయ్యాను.. నేను ఎలాగైనా బరువు తగ్గాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించాను అంటూ చెప్పుకొచ్చింది.

కానీ నాకు పీసీఓడీ సమస్య ఉంది. అందుకే నిరంతం నా శరీరాకృతి, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటాను. పీసీఓడీ సమస్యను దృష్టిలో పెట్టుకుని నా ఆరోగ్య పరమైన మార్పులు, చేర్పులు చాలా అవసరం అంటూ చెప్పుకొచ్చింది. మంజిమా మోహన్ తెలుగులో సాహసమే శ్వాసగా సాగిపో, కధానాయకుడు వంటి చిత్రాల్లో నటించింది.