
చియా సీడ్స్ ఇటీవల కాలంలో సూపర్ ఫుడ్ గా ప్రసిద్ధి చెందాయి. కానీ ప్రతి సూపర్ ఫుడ్ అందరికీ సరిపడదు. ఈ కథనంలో, చియా సీడ్స్ యొక్క వాస్తవాలు, అవి ఎవరికి మంచివి, ఎవరికి ప్రమాదకరం అనే విషయాలను వివరంగా పరిశీలిద్దాం. ఒక టేబుల్ స్పూన్ (సుమారు 15 గ్రాములు) చియా సీడ్స్‌లో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, ఐరన్ వంటి అద్భుతమైన పోషక విలువలు ఉంటాయి ఈ పోషక ప్రొఫైల్ చూసినప్పుడు చాలా ఆరోగ్యకరంగా అనిపిస్తుంది, కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది.

జీర్ణ సమస్యలు: చియా సీడ్స్‌లో ఫైబర్ చాలా అధికంగా ఉంటుంది. అలవాటు లేనివారు లేదా ఒక్కసారిగా ఎక్కువ మోతాదులో తీసుకుంటే గ్యాస్, పొట్ట ఉబ్బరం, మలబద్దకం లేదా డయేరియా వంటి జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. ఇర్రిటబుల్ బోవెల్ సిండ్రోమ్ (IBS) వంటి ప్రేగు సంబంధిత సమస్యలు ఉన్నవారు వీటిని నివారించడం లేదా వైద్య సలహా మేరకు తీసుకోవడం మంచిది.

రక్తపోటు తగ్గడం: చియా సీడ్స్‌లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తాన్ని పలుచగా చేస్తాయి. ఇప్పటికే బీపీ మందులు తీసుకుంటున్న వారికి, చియా సీడ్స్ తీసుకోవడం వల్ల బీపీ బాగా తగ్గిపోవడం (హైపోటెన్షన్), తల తిరగడం వంటివి జరగవచ్చు. కాబట్టి, బీపీ మందులు వాడేవారు వైద్యుని సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం: డయాబెటిస్ ఉన్నవారికి చియా సీడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించగలవు. ఇన్సులిన్ లేదా ఇతర షుగర్ మందులు తీసుకునేవారు చియా సీడ్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అనూహ్యంగా తగ్గిపోయి హైపోగ్లైసీమియాకు దారితీయవచ్చు. వీరు కూడా వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి.

అలర్జీ రిస్క్: కొంతమందికి చియా సీడ్స్ వల్ల అలర్జీలు రావొచ్చు. చర్మంపై దద్దుర్లు, వాపు, దురద, లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. నువ్వుల అలర్జీ ఉన్నవారు చియా సీడ్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే క్రాస్-అలర్జీ వచ్చే అవకాశం ఉంది.

ఊపిరి ఆడకపోవడం: చియా సీడ్స్ నీటిలో కలిసినప్పుడు తమ అసలు పరిమాణం కంటే 10 రెట్లు వరకు ఉబ్బుతాయి. డ్రైగా చియా సీడ్స్ తిని, వెంటనే నీళ్లు తాగినప్పుడు అవి గొంతులో ఉబ్బి ఇరుక్కుపోయి, ఊపిరి ఆడకపోవడం వంటి ప్రమాదాలు విదేశాల్లో నమోదయ్యాయి. కాబట్టి, ఎప్పుడూ నానబెట్టిన చియా సీడ్స్‌నే తీసుకోవడం మంచిది.

ఎవరు చియా సీడ్స్ తీసుకోవచ్చు ?? ఆరోగ్యవంతమైన పెద్దలు, మితమైన మోతాదులో, వైద్యుని సలహా మేరకు తీసుకోవచ్చు. ఫైబర్ అవసరమయ్యేవారు, ప్రోటీన్ కోసం చూస్తున్న శాఖాహారులు, మరియు జిమ్ వెళ్లేవారు పరిమితికి లోబడి తీసుకోవచ్చు.