
కరోనా తర్వాత చాలా మంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అయితే గుండెపోటు ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. దీనికి మన జీవన శైలి కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. డాక్టర్ చాజర్ ప్రకారం.. గుండెపోటుకు ముందు శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలను గుర్తించడం ద్వారా సకాలంలో వైద్య సహాయం తీసుకోవచ్చు.

మీ శరీరం ఇచ్చే హెచ్చరికలు: ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి: ఇది సాధారణంగా గుర్తించే ప్రధాన లక్షణం. నొప్పి వ్యాప్తి: ఛాతీ నొప్పి చేతులు, మెడ, దవడ లేదా వీపు వరకు ప్రసరించడం. ఇతర లక్షణాలు: శ్వాస ఆడకపోవడం, చలి చెమటలు, వికారం, తల తిరగడం.

అస్థిర ఆంజినా: గుండెకు రక్తం సరిగా అందడం లేదని సూచించే అతి ముఖ్యమైన హెచ్చరిక ఇది. దీన్నే గుండెపోటుకు ముందు వచ్చే వ్యాధి అని కూడా అంటారు. ఛాతీ నొప్పి, అసౌకర్యం, శ్వాస ఆడకపోవడం, అసాధారణ అలసట వంటి లక్షణాలు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు లేదా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు కూడా కనిపించవచ్చు. ఇది పూర్తి గుండెపోటుగా మారడానికి అవకాశం.

నిశ్శబ్ద గుండెపోటు: ఈ రకమైన గుండెపోటు అతి తక్కువ లక్షణాలతో లేదా అసలు లక్షణాలు లేకుండా సంభవిస్తుంది. అందుకే దీనిని గుర్తించడం కష్టం. లక్షణాలు లేకపోవడం వల్ల గుండె లోపలి భాగం దీర్ఘకాలికంగా దెబ్బతింటుంది. ఇది భవిష్యత్తులో పెద్ద గుండెపోటుకు దారితీయవచ్చు. తేలికపాటి ఛాతీ అసౌకర్యం, తీవ్ర అలసట లేదా శ్వాస ఆడకపోవడం వంటి చిన్నపాటి మార్పులను కూడా సీరియస్‌గా తీసుకోవాలి.

ప్రాణాలు కాపాడుకోవడానికి.. మీ శరీరం చెప్పే మాటను వినండి. ఏ చిన్న లక్షణం కనిపించినా వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని, ముఖ్యంగా జీరో-ఆయిల్ డైట్‌ను పాటించడం గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ముఖ్యం.