
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) గత నెలలో కొత్త ఆధార్ యాప్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. జనవరి నెలాఖరులో ఆధార్ పేరుతో ఈ యాప్‌ను లాంచ్ చేసింది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఆధార్ యాప్‌ను తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ యాప్‌కు వినియోగదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. రికార్డు స్థాయిలో యూజర్లు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ఇప్పటివరకు ఏకంగా 14 మిలియన్ డౌన్‌లోడ్లను క్రాస్ చేసింది. 1 మిలియన్ మంది మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకున్నారు. ఈ యాప్ నుంచి ఎక్కడినుంచైనా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకునే సౌకర్యంతో పాటు ఆధార్ వివరాల రక్షణ కోసం లాక్ లేదా అన్ లాక్ చేసుకోవడం, క్యూఆర్ కోడ్ షేరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో ఈ యాప్‌ను ఎక్కువ మంది డౌన్ లోడ్ చేసుకుని వాడుతున్నారు.

జనవరి 28వ తేదీన ఈ యాప్‌ను జాతికి అంకితం చేశారు. రోజుకు సగటున లక్ష చొప్పున డౌన్‌లోడ్స్ జరిగాయి. 1 మిలియన్ కంటే ఎక్కువమంది ఈ యాప్ ఉపయోగించి తమ మొబైల్ నెంబర్లను అప్డేట్ చేసుకోవడం విశేషం. సురక్షితమైన, డిజిటల్, గోప్యత ప్రాధాన్యత కలిగిన ఆధార్ సేవలపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకాన్ని ఈ స్పందన తెలియచేస్తుందని యూఐడీఏఐ చెబుతోంది.

ఆధార్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో ఆధార్ వెరిఫికేషన్ కోసం ఫేస్ రికగ్నిషన్, ఒకే క్లిక్‌తో ఆధార్ వివరాలు లాక్, అన్ లాక్‌తో పాటు క్యూఆర్ ఆధారిత కాంటాక్ట్ కార్డ్, ఈ ఆధార్ డౌన్ లోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక మొబైల్ నెంబర్, అడ్రస్ వంటి వివరాలు సులువుగా అప్‌డేట్ చేసుకునే సౌకర్యం ఉంది.

ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 3,57,000 మంది బయోమెట్రిక్ వివరాలు లాక్, అన్ లాక్ చేసుకున్నారు. ఇక 8 లక్షల మంది ఈ -ఆధార్ డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ రాకతో ఆధార్ సెంటర్లకు వెళ్లి గంటల కొద్ది క్యూలైన్లలో వెయిట్ చేయాల్సిన పని తప్పింది. దీని వల్ల ఆధార్ సెంటర్లపై ఒత్తిడి తగ్గింది.