
గత వారంలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ వారంలో శాంతించాయి. ఈ వారం నుంచి బంగారం ధరలు భారీగా పతనమవుతూ వస్తోన్నాయి. నూతన సంవత్సరం వేళ పసిడి ధరలు కుప్పకూలడం కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది. ధర తగ్గుతుండటంతో బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.

బంగారం ధర 1.7 శాతం తగ్గగా.. వెండి ధరలు 3 శాతానికిపైగా ఢమాల్ అయ్యాయి. అయితే మొన్నటిపెరుగుతూ వచ్చిన ధరలు ఉన్నట్లుండి ఒక్కసారిగా డౌన్ అవ్వడం వెనుక కారణాలు ఏంటనే చర్చ జరుగుతోంది. ఇందుకు అంతర్జాతీయంగా అనేక రీజన్స్ ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న కొన్ని సంఘటనలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. దీంతో ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్దం ముగిసిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించడంతో పాటు త్వరలో ఈ రెండు దేశాల మధ్య యుద్దం ముగిసిపోతుందనే చర్చ నడుస్తోంది. ధరల తగ్గుదలకు ఇదొక ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

ఇక డిసెంబర్ 31న విడుదల కానున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ మినిట్స్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. వడ్డీ రేట్లను ఫెడ్ తగ్గించే అవకాశముందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై సరైన స్పష్టత లేకపోవడం వల్ల ధరలు పెరుగుతున్నాయి. దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్న క్రమంలో గోల్డ్, వెండి రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి.

ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్దానికి ఎండ్ కార్డ్ పడితే బంగారం ధరలు భారీగా పడిపోనున్నాయి. అంతర్జాతీయంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సమయంలో పెట్టుబడిదారులు బంగారంలో ఎక్కువ పెట్టుబడులు పెడతారు. దీని వల్ల బంగారం రేట్లు పెరుగుతాయి.