
రుణం ఎందుకు.. పర్సనల్ లోన్ సులభంగా మంజూరవుతుంది కాదా అని తీసుకోవడం మంచిది కాదు. మన అవసరాన్ని బట్టి తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే వీటిల్లో అధిక వడ్డీలు ఉంటాయి. ఇవి మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉంటుంది. విలాసాలు, కోరికల కోసం కాకుండా అవసరాన్ని బట్టి రుణం తీసుకోవడం మేలు.

రుణదాత విషయంలో.. పర్సనల్ లోన్ అనేది ఏ బ్యాంకులో తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. బ్యాంకు, ఎన్బీఎఫ్సీ, పలు యాప్ లు ఈ రుణాలను మంజూరు చేస్తున్నాయి. వీటిల్లో మీకు ఏది ప్రయోజనకరంగా ఉంటుందో అంచనా వేసుకోవాలి. అలాగే కొన్ని ఫేక్ యాప్స్ కూడా ఉంటాయి. వాటిపై అవగాహన కలిగి ఉండి, అప్రమత్తంగా ఉండాలి.

వడ్డీ రేట్లు.. పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ రేటు గురించి కూడా చూడాలి. దేనిలో తక్కువ వడ్డీ ఉందో ఎంక్వైరీ చేయాలి. సాధారణంగా బ్యాంకులు అయితే 13శాతం నుంచి, ఎన్బీఎఫ్సీలు 23శాతం వరకూ వడ్డీ రేటు విధిస్తూ ఉంటాయి. ఆయా బ్యాంకుల్లో వడ్డీ రేట్లను సరిపోల్చి తక్కువ ఉన్న దానిలోనే లోన్ తీసుకోవడం ఉత్తమం.

కాల వ్యవధి.. రుణం చెల్లింపు వ్యవధి కూడా చాలా ముఖ్యం. సాధారణంగా పర్సనల్ లోన్లలో చెల్లింపు వ్యవధి 12 నుంచి 60 నెలల మధ్య ఉంటుంది. మీరు తీసుకునే రుణం, ఈఎంఐ చెల్లించగలిగే స్థితిని బట్టి దీనిని ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ రాబడి, ఖర్చులను బట్టి దీనిపై నిర్ణయించుకోండి.

ముందస్తు చెల్లింపులు.. సాధారణంగా పర్సనల్ లోన్లు ముందస్తు చెల్లింపులకు అవకాశం ఉంటుంది. అయితే దానికి కొంత రుసుంను పెనాల్టీగా బ్యాంకులు విధిస్తాయి. ఇది సాధారణంగా 2 నుంచి 5 శాతం మధ్య ఉంటాయి. రుణం తీసుకునే ముందే దీని గురించి తెలుసుకోవాలి.