
ప్రయాణాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బైక్ లలో హార్లే - డేవిడ్సన్ ఎక్స్ 440 ఒకటి. దీనిలో 440 సీసీ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దాని నుంచి 27 బీహెచ్ పీ శక్తి, 38 ఎన్ ఎం టార్కు విడుదల అవుతుంది. మలుపులు, నిటారుగా ఉండే రోడ్లపై చక్కగా పరుగులు తీస్తుంది. 194.5 కిలోల బరువు, 170 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 805 ఎంఎం సీటు దీని ప్రత్యేకతలు. రూ.2.39 లక్షలకు ఈ బైక్ అందుబాటులో ఉంది.

కొండ ప్రాంతాలతో పాటు అన్ని రకాల రహదారులపై ప్రయాణానికి హోండా సీబీ 350 అనువుగా ఉంటుంది. దీనిలో 348.36 సీసీ సింగిల్ - సిలిండర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దాని నుంచి 20.78 బీహెచ్ పీ శక్తి, 29.5 ఎన్ ఎం టార్కు విడుదల అవుతుంది. 186 కిలోల బరువు కారణంగా చాలా స్థిరంగా డ్రైవింగ్ చేయవచ్చు. 800 ఎంఎం ఎత్తయిన సీటు, 165 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ తో ఎక్కువ దూరాలకు అలసట లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఈ బండిని రూ.1.99 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.

వంకర, గతుకుల రోడ్లపై ప్రయాణానికి హోండా రెబెల్ 500 బైక్ చాలా బాగుంటుంది. దీనిలోని 471 సీసీ సమాంతర ట్విన్ ఇంజిన్ నుంచి 45.5 బీహెచ్ పీ శక్తి, 43.3 ఎన్ ఎం టార్కు విడుదల అవుతుంది. 191 కిలోల బరువు ఉన్నప్పటికీ బైక్ ను చాలా సులువుగా నియంత్రణ చేయవచ్చు. 690 ఎంఎం సీటు ఎత్తు, 125 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ తో ప్రయాణానికి చాలా వీలుగా ఉంటుంది. ఈ బైక్ రూ.5.10 లక్షల ధరకు అందుబాటులో ఉంది.

ఎత్తుపల్లాలు, మలుపులతో కూడిన రోడ్లపై ప్రయాణానికి రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్ 350 చాలా బాగుంటుంది. దీనిలోని 349 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి 20.2 బీహెచ్ పీ శక్తి, 27 ఎన్ఎం టార్కు విడుదలవుతుంది. ముఖ్యంగా లడఖ్ ప్రాంత రహదారులపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగించవచ్చు. 181 కిలోల బరువు, 160 ఎంఎ గ్రౌండ్ క్లియరెన్స్, 790 ఎంఎం ఎత్తయిన సీటుతో ప్రయాణానికి అనువుగా ఉంటుంది. ఈ బైక్ రూ.1.49 లక్షలకు అందుబాటులో ఉంది.

పర్యటనలకు ఎంతో ఉపయోగపడేలా కవాసకి ఎలిమినేటర్ బైక్ ను తీసుకువచ్చారు. గతంలో కంటే కొన్ని ప్రత్యేకతలతో రూపొందించారు. దీనిలోని 451 సీసీ సమాంతర ట్విన్ ఇంజిన్ నుంచి 44.7 బీహెచ్ పీ శక్తి, 42.6 ఎన్ ఎం టార్కు విడుదల అవుతుంది. సుదూర ప్రయాణాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 176 కిలోల బరువు, 735 ఎంఎ సీటు ఎత్తు, 150 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ దీని ప్రత్యేకతలు. ఈ బైక్ రూ.5.76 లక్షల ధరలో అందుబాటులో ఉంది.