
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. పండుగల సీజన్ క్రమంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా అనేక స్పెషల్ ట్రైన్లను తీసుకురాగా.. ఇప్పుడు మరో రెండు సర్వీసులను ప్రకటించింది. తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమల వెళ్లే భక్తులకు ఈ ట్రైన్ ఉపయోగపడనుంది. ఈ రైలు పూర్తి షెడ్యూల్ ఇప్పుడు చూద్దాం.

రైళ్లల్లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు మరో ప్రత్యేక రైలును దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది. ప్రయోగరాజ్-తిరునెల్లి మధ్య ప్రత్యేక రైలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయోగరాజ్-తిరునెల్లి(04171) ప్రత్యేక రైలు సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది. ఇక తిరునెల్లి-ప్రయోగరాజ్(04172) రైలు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 12 వరకు ప్రతీ సోమవారం సర్వీసులు అందించనుంది.

ఈ రైళ్లు మాణిక్‌పూర్, సత్నా, కట్నీ, జబల్‌పూర్, ఇటార్సీ, నాగ్‌పూర్, చంద్రపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్ నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, నమక్కల్, కరూర్, దిండిగల్, మదురై, విరుదునగర్, సాతుర్, కోవిల్‌పట్టి స్టేషన్లలో ఆగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తన ప్రకటనలో వెల్లడించింది.

ఈ రైళ్లల్లో 3AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రయాణికులు ఈ స్పెషల్ ట్రైన్లను ఉపయోగించుకోవాలని రైల్వేశాఖ సూచించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి రోజూ తిరుమల శ్రీవారి దర్శనానికి వేలమంది వెళుతుంటారు. ఈ స్పెషల్ ట్రైన్ రేణిగుంట మీదుగా వెళుతుండటంతో.. తిరుమల శ్రీవారి భక్తులకు ఉపయోగపడనుందని చెప్పవచ్చు. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరగనుండటంతో తిరుపతి వైపు వెళ్లే రైళ్లల్లో రద్దీ పెరిగింది.

ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. టీటీడీ అంగరంగ వైభవంగా వీటిని నిర్వహిస్తోంది. బ్రహ్మోత్సవాలు చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. దీంతో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అలాగే 20వ తేదీ వరకు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని నిలిపివేసింది.