
ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. తులం బంగారం ఏకంగా రూ. 80 వేలకు చేరింది. డాలర్ విలువ బలపడడంతో కాస్త తగ్గినట్లే తగ్గి మళ్లీ దూసుకుపోతోంది. అయితే బంగారం కొనుగోలు చేయలేని వారు వెండి కొనుగోలు చేస్తే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.

రానున్న రోజుల్లో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మున్ముందు వెండికి డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు. బంగారం, వెండి నిల్వలు క్రమంగా తగ్గడం ఒక్క ఏడాదిలోనే వెండి ధర 46 శాతం పెరగడమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు.

ఇటీవల కిలో వెండి ధర ఏకంగా రూ. లక్ష దాటేసింది. బ్యాంకుల వడ్డీ రేట్లతో సంబంధం లేకుండా భవిష్యత్తులో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని సిల్వర్ ఇన్‌స్టిట్యూట్ అభిప్రాయపడుతోంది.

వెండి ధరలు పెరగడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వెండికి ఏఐ టెక్నాలజీకి సంబంధం ఏంటనేగా. ఏఐలో వాడే చిప్స్ తయారీలో సిల్వర్ కీలకంగా మారనుంది. దీంతో రానున్న రోజుల్లో ఏఐ మరింత విస్తరించనుంది. దీంతో వెండి భారీగా డిమాండ్ ఏర్పడనుందని అభిప్రాయపడుతున్నారు.

అంతేకాకుండా సౌర విద్యుత్‌లో కూడా సిల్వర్‌ను ఉపయోగిస్తారు. సోలార్ సెల్స్ నుంచి విద్యుత్ ప్రవహించేందుకు వెండి వాహకంగా పనిచేస్తుంది. ప్రస్తుతం దేశంలో సౌర విద్యుత్ పరిశ్రమ వృద్ధి చెందుతోన్న తరుణంలో వెండికి డిమాండ్ భారీగా పెరగడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వెండి పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.