
చాలా మందికి ఉన్న ఊర్లోనే బతకాలని ఉంటుంది. మంచి వ్యాపారం చేస్తూ ఆర్థికంగా స్థిరపడాలని అనుకుంటారు. అయితే సరైన వ్యాపారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. పెట్టుబడి పెడితే ఎక్కడ నష్టం వస్తుందోనని భయపడే కంటే మంచి వ్యాపారాన్ని ప్రారంభించి, దాన్ని సమర్థవంతంగా నడిపిస్తే నష్టమనే మాట ఉండదు. ఊర్లో ఉంటూ వ్యాపారం చేసే వారి కోసం 5 బెస్ట్ బిజినెస్ ఐడియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఎరువుల వ్యాపారం.. గ్రామీణ ప్రాంతాల్లో అంతా ఆధారపడేది వ్యవసాయంపైనే. అలాంటి వ్యవసాయానికి అనుబంధంగా ఉండే ఎరువుల వ్యాపారం ఎప్పుడూ లాభదాయకంగా ఉంటుంది. రైతులకు ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్‌లు అవసరం. ప్రభుత్వ అనుమతి తీసుకొని, తక్కువ పెట్టుబడితో ఈ ఎరువుల వ్యాపారం ప్రారంభించవచ్చు.

పిండి మిల్లు.. పల్లెల్లో జొన్న రొట్టెలు, చపాతీలు, తృణధాన్యాల ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే నగరాల్లోలా అక్కడ పిండి కొనే బదులు పిండి పట్టిస్తారు. దీంతో గ్రామంలో పిండి మిల్లు పెట్టడం మంచి వ్యాపారంగా చెప్పుకోవచ్చు. చాలా మంది ప్రజలు బయట దొరికే ప్యాక్డ్ పిండి కంటే, తమ కళ్ల ముందే స్వచ్ఛంగా పట్టించిన పిండిని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. తక్కువ స్థలంలో తక్కువ విద్యుత్ వినియోగంతో నడిచే యంత్రాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఈ వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించి ప్రతి నెలా మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

పౌల్ట్రీ వ్యాపారం.. గ్రామాల్లో లాభదాయమైన వ్యాపారాల్లో పౌల్ట్రీ బిజినెస్ ఒకటి. మటన్, చికెన్, గుడ్లకు ఉన్న డిమాండ్ కారణంగా ఒక ఫామ్ లేదా దుకాణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. బాయిలర్ కోళ్లతో పాటు నాటు కోళ్ల పెంపకం, వాటి మాంసం అమ్మకం కూడా మంచి లాభాలు ఇస్తుంది. దీనికి కూడా పెద్దగా పెట్టుబడి అవసరం లేదు.

పండ్లు, కూరగాయల ఎగుమతి.. సాధారంగా గ్రామాల్లో తమ పోలాల్లో రైతులు కూరగాయలు పండిస్తుంటారు. అయితే భూమి లేని వారు రైతుల నుంచి వాటిని కొని నగరాలకు, మార్కెట్‌లకు ఎగుమతి చేస్తూ మంచి ఆదాయం పొందవచ్చు.

కిరాణం.. గ్రామాలు టౌన్లకు కాస్త దూరంగా ఉంటాయి. అక్కడ ప్రతి వస్తువు లభించదు. గ్రామస్థులు తమకు ఏదైనా అవసరం అయితే వెంటనే టౌన్‌కు వెళ్లలేరు. ఒక చిన్న వస్తువు కోసం అంత దూరం ప్రయాణించడం వేస్ట్. అందుకే గ్రామంలో కిరాణా, జనరల్ స్టోర్ పెట్టుకుంటే మంచి లాభం పొందవచ్చు. పైగా పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. ఇంటి పట్టునే ఉంటూ మంచి ఆదాయం పొందవచ్చు.