Steel Prices: ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఇక ఉక్కు ధరలు కూడా ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా కోకింగ్ కోల్ ధరలు పెరగడంతో పెరిగిన వ్యయంలో కొంత భాగాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నాయి. గత నెల రోజులుగా ఫ్లాట్, లాంగ్ ప్రొడక్ట్స్ ధరలు పెరుగుతున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
సగటున ఉక్కు ఉత్పత్తుల ధరలు టన్నుకు రూ.5,000 నుంచి రూ.6,500 వరకూ పెరిగాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ వంటి కంపెనీలు ఉక్కు ఉత్పత్తుల ధరలను పెంచేశాయి.
ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తులను ఆటోమొబైల్, గృహోపకరణాలు తదితరాల్లో వినియోగిస్తారు. అలాగే నిర్మాణ రంగంలో, ఇతర పరిశ్రమల్లో లాంగ్ ప్రొడక్ట్స్‌ను వినియోగిస్తుంటారు. ఉక్కు ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల అన్ని పరిశ్రమల్లో ఉత్పత్తి వ్యయం పెరిగి.. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక హాట్ రోల్డ్ కాయిల్ (హెచ్‌ఆర్‌సీ) టన్ను ధర ప్రస్తుతం రూ.70 వేల నుంచి రూ.71 వేలకు చేరుకోగా, నిర్మాణ రంగంలో వినియోగించే లాంగ్ ప్రొడక్ట్స్ టన్ను ధర సుమారు రూ.61 వేల నుంచి రూ. 62వేలకు చేరుకుంది.