
ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం పెయింట్ కంపెనీలపై పడింది. వచ్చే నెలలో ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే దేశంలో పెయింట్ ధరలు పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీలు పెంచేందుకు సిద్దమవుతున్నాయి. రెండు నుంచి 5 శాతం వరకు పెయింట్ ధరలు పెంచవచ్చని సమాచారం.

సిస్టమ్‌మాటిక్స్ రీసెర్చ్ కీలక నివేదిక జారీ చేసింది. ఈ రిపోర్టులో ముడి చమురు ధరలు ఇలాగే పెరిగితే ఏప్రిల్ నుంచి పెయింట్ ధరలపై ప్రభావం పడవచ్చని అంచనా వేసింది. భారత్‌లో పెయింట్ ధరలను వచ్చే నెల నుంచి కంపెనీలు పెంచేందుకు రెడీ అవుతున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే డీలర్లు ధరల పెరుగుదులపై చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది.

ప్రస్తుతానికి ఏ కంపెనీ పెయింట్ ధరలను పెంచడంపై అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. ముడి చమురు ధరల పెరగడంతో ఖర్చులను అంచనా వేసేందుకు మార్చి వరకు వేచి ఉండాలనే ధోరణిలో కంపెనీలు ఉన్నాయి. ముడి చమురు ధరల ప్రభావం దీర్ఘకాలంగా కొనసాగితే పెయింట్ ధరలను పెంచవచ్చని తెలుస్తోంది.

అయితే పెయింట్ రంగంలో కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో ధరలను పెంచడంపై జాగ్రత్తలు తీసుకోవచ్చు. ధరల పెరుగుదల ఒకేసారి అమలు చేయకుండా క్రమక్రమంగా పెంచాలని భావిస్తున్నారు. మెదటి రౌండ్ పెరుగుదల కొత్త ఆర్ధిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఉండవచ్చు. ఈ పెరుగుదల స్వల్పంగానే ఉంటుంది

త్రైమాసిక ప్రాతిపాదికన సుమారు 10 శాతం ధరలను పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి. కంపెనీల స్థూల మార్జిన్లు సగటున సుమారు 130 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చు. పెయింట్ పరిశ్రమలో బలమైన డిమాండ్ ఉంది. ప్రీమియం, లగ్జరీ పెయింట్ల ఉత్పత్తుల కంటే ఎకానమీ ఎమల్షన్లు అమ్మకాలు వేగంగా పెరగుతున్నాయి.