
దేశంలో ప్రస్తుతం కాగితంతో తయారుచేస్తున్న కరెన్సీ నోట్లను మనం ఉపయోగిస్తున్నాం. కానీ రానున్న రోజుల్లో వీటి స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నాహాలు చేస్తోంది. పాలిమర్‌తో తయారుచేసే ప్లాస్టిక్ నోట్లను తీసుకురావాలని సమాలోచనలు చేస్తోంది. గతంలో యూపీఐ హయాంలోనే ఇలాంటి ప్రతిపాదన చేయగా.. అది పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు మరోసారి ఆ ప్రతిపాదన తెరపైకి వచ్చింది

జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే అంశంపై చర్చించారు. అనంతరం ఆర్బీఐ గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్లాస్టిక్ నోట్ల అంశం ప్రతిపాదన దశలో ఉందని ప్రకటించారు. వివిధ వర్గాల అభిప్రాయం తీసుకుంటున్నామని, తీసుకొచ్చే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఆయన ప్రకటనతో భవిష్యత్తులో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే అవకాశముందని తెలుస్తోంది.

అయితే ప్లాస్టిక్ నోట్లను ఎలా తయారుచేస్తారనే అనుమానం చాలామందికి ఉంది. వీటిని రేకుతో లేదా ప్లాస్టిక్‌తో తయారుచేయరు. పాలిమర్లతో తయారుచేస్తారు. పాలీప్రొపీలిన్ అనే ప్రత్యేక పదార్ధంతో తయారుచేస్తారు. దీని వల్ల నోట్లు త్వరగా పాడవ్వవు. కాగితపు నోట్ల కంటే ధృడంగా ఉంటాయి. మెషీన్‌లో ఉతికినా కూడా చెక్కుచెదరకుండా అలాగే ఉంటాయి. దీంతో చిరిగిపోతాయనే భయం అసలు ఉండదు.

ఇప్పటికే అనేక దేశాల్లో పాలిమర్ ఆధారిత ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, మలేషియా, న్యూజిలాండ్, వియత్నం వంటి దేశాల్లో ఇప్పటికే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. దీంతో భారత్ కూడా అదే బాటలో ప్లాస్టిక్ నోట్లును తీసుకురావాలని చూస్తోంది. ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లను పత్తితో తయారుచేస్తున్నారు. ఇవి త్వరగా చిరిగిపోతున్నాయి.

అదే ప్లాస్టిక్ నోట్లు అయితే చిరిగిపోయే, పాడైపోయే అవకాశం ఉండదు. అలాగే నకిలీ నోట్లను తయారుచేయడం కూడా కష్టంతో కూడుకున్న పని. వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉండటంతో ఆర్బీఐ కూడా తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉండగా.. రానున్న రోజుల్లో చలామణిలోకి తీసుుకొచ్చే అవకాశముంది.