
వడ్డీ తగ్గుతుంది.. గృహ రుణం దీర్ఘకాలం పాటు చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల వడ్డీ భారం అధికంగా ఉంటుంది. మీరు తీసుకున్న దాని కన్నా ఎక్కువ వడ్డీ రూపంలో ఆర్థిక సంస్థకు చెల్లిస్తారు. దీనిని గణనీయంగా తగ్గించడానికి ముందుస్తు చెల్లింపు అనేది బాగా ఉపకరిస్తుంది. వడ్డీ మొత్తంతో పాటు రుణ వ్యవధి కూడా తగ్గుతుంది.

రుణ విముక్తి.. సాధారణంగా గృహ రుణం 20 ఏళ్లకు పైగానే ఉంటుంది. అన్నేళ్ల పాటు మనకు అప్పు కొనసాగుతుంది. అయితే ముందస్తు చెల్లింపు వల్ల బాకీ ఉన్న బ్యాలెన్స్ తగ్గుతుంది. వడ్డీ రేట్లు పెరుగుతున్న సమయంలో దీనివల్ల డబ్బును గణనీయంగా ఆదా చేసుకునే వీలుంటుంది.

క్రెడిట్ హిస్టరీ .. మీ రుణం ముందుగానే తీర్చడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. దీనితో వేరే పథకాల్లో పెట్టుబడులు పెట్టే వీలుంటుంది. రుణాన్ని వేగంగా తీర్చడం క్రెడిట్ హిస్టరీ కూడా మెరుగవుతుంది. భవిష్యత్తులో మరిన్ని రుణాలు తక్కువ వడ్డీ రేట్లకు మంజూరవుతాయి.

జరిమానా.. గృహ రుణాన్ని ముందస్తుగా చెల్లించే ప్రయత్నం చేస్తే.. ఆర్థిక సంస్థలు కొంత మొత్తాన్ని జరిమానాను వసూలు చేస్తాయి. రుణ సంస్థల మార్గదర్శకాలను బట్టి ఇది సుమారుగా 4 నుంచి 5 శాతం వరకూ ఉంటుంది.

పన్ను ప్రయోజనాలు.. సాధారణంగా గృహ రుణం కలిగి ఉంటే దాని వల్ల పన్ను ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ముందుస్తుగా చెల్లించడం వల్ల ఈ ప్రయోజనాలు కోల్పోవలసి ఉంటుంది. ఆదాయ పన్నుల చట్టం సెక్షన్ 80సీ కింద రూ. 1.50లక్షలు, సెక్షన్ 24బీ కింద రూ. 2లక్షల వరకూ పన్ను ప్రయోజనం ఉంటుంది. వీటిని వదులుకోవాల్సి వస్తుంది.