
ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఐఆర్‌సీటీసీ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. రెడ్ బస్, అబీ బస్, కన్ఫార్మ్ మై టికెట్ లాంటి థర్డ్ పార్టీ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉన్నా.. వాటిల్లో కూడా ఐఆర్‌సీటీసీ అకౌంట్ డీటైల్స్ టైప్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఐఆర్‌సీటీసీ అకౌంట్లోకి లాగిన్ అయితేనే థర్డ్ పార్టీ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లో టికెట్ బుకింగ్ అవుతుంది. ఐఆర్‌సీటీసీ వివరాలతో లాగిన్ అవ్వకపోతే టికెట్ డబ్బులు వెంటనే వెనక్కి వచ్చేస్తాయి

ఐఆర్‌సీటీటీ అకౌంట్లోకి వెళ్లి టికెట్ బుక్ చేసుకోవాలంటే కనీసం ఐదు నిమిషాల టైమ్ పడుతుంది. వెబ్‌సైట్ ఓపెన్ చేసి ట్రైన్ల వివరాలు తెలుసుకుని పేమెంట్ చేయడానికి 10 నిమిషాల టైమ్ కూడా పట్టవచ్చు. ఇక తాత్కాల్ టికెట్లు పొందటానికి తక్కువ టైమ్ ఉంటుంది గనుక చాలా వేగంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే టికెట్లు అయిపోయే అవకాశముంది.

కొంతమంది ఏజెంట్లు ఆటోమేషన్, ఏఐ సాఫ్ట్‌వేర్లు ఉపయోగించి చాలా వేగంగా టికెట్లు బుక్ చేస్తున్నారు. వీటి కోసం టెస్లా, గదర్, బ్రహ్మోస్, సూపర్ తత్కాల్, అవెంజర్ లాంటి రెంటల్ సాఫ్ట్‌వేర్లను వాడుతున్నారు. ఈ సాఫ్ట్‌వేర్లు మిగతా వెబ్‌సైట్లలో పోలిస్తే అత్యంత వేగంగా సర్వర్‌కు అభ్యర్థనలు పంపుతాయి. దీని వల్ల సాధారణ ప్రజలు బుక్ చేసుకునేలోపే వీళ్లు వేగంగా ఆ సాఫ్ట్‌వేర్లు ఉపయోగించి టికెట్లు బుక్ చేసేస్తారు.

చాలామంది ఏజెంట్లు ఇలాంటి సాఫ్ట్‌వేర్లు ఉపయోగించి టికెట్లు బుక్ చేస్తున్నారు. దీంతో రైల్వే టికెట్ల కోసం కొంతమంది వీరిని ఆశ్రయిస్తున్నారు. దీని వల్ల సామాన్య ప్రజలకు నష్టం జరుగుతోంది. వీళ్లు వేగంగా టికెట్లు బుక్ చేయడం వల్ల సామాన్యులకు టికెట్లు దొరకడం లేదు. అక్రమ సాఫ్ట్‌వేర్లు ఉపయోగించి కేవలం సెకన్ల వ్యవధిలోనే టికెట్లు బుక్ చేస్తున్నారు.

ఈ సాఫ్ట్‌వేర్ల రెంట్ నెలకు రూ.1200 నుంచి రూ.3200 వరకు ఉంటుంది. దీంతో వీటిని ఏజెంట్లు ఉపయోగిస్తూ తక్కువ టైమ్‌లోనే టికెట్లు బుక్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి నిబంధనలు, చట్టాలు లేకపోవడంతో రైల్వే అధికారలు నియంత్రించలేకపోతున్నారు.