
పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరికీ నా డబ్బు ఎప్పుడు రెట్టింపు అవుతుందా? అనే సందేహం ఉంటుంది. దీనికి సులభంగా సమాధానం చెప్పే గణిత సూత్రమే రూల్ ఆఫ్ 72. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి నిపుణులు ఉపయోగించే ఈ నియమం ద్వారా, పెట్టుబడి రెట్టింపు కావడానికి ఎంత సమయం పడుతుందో సులభంగా అంచనా వేయవచ్చు.

ఈ సూత్రం ప్రకారం.. 72 అనే సంఖ్యను పెట్టుబడిపై లభించే వార్షిక వడ్డీ రేటుతో భాగిస్తే, ఆ పెట్టుబడి రెట్టింపు కావడానికి పట్టే సంవత్సరాల సంఖ్య తెలుస్తుంది. ఉదాహరణకు ఎవరైనా రూ.5 లక్షలను సంవత్సరానికి 8 శాతం వడ్డీ వచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెడితే, 72 ÷ 8 = 9. అంటే ఆ డబ్బు సుమారు 9 సంవత్సరాల్లో రూ.10 లక్షలకు పెరుగుతుంది.

అదేవిధంగా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో 4 శాతం వడ్డీ వస్తే 72 ÷ 4 = 18. అంటే డబ్బు రెట్టింపు కావడానికి 18 సంవత్సరాలు పడుతుంది. మరోవైపు సంవత్సరానికి 12 నుంచి 13 శాతం రాబడులు ఇచ్చే మ్యూచువల్ ఫండ్లు లేదా ఈక్విటీ పెట్టుబడుల్లో డబ్బు సుమారు 5 నుంచి 6 సంవత్సరాల్లో రెట్టింపు కావచ్చు.

అయితే మార్కెట్ ఆధారిత పెట్టుబడుల్లో రాబడులు స్థిరంగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్‌లలో లాభాలు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడతాయి. కానీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బాండ్లు వంటి స్థిర వడ్డీ పథకాలలో ఈ లెక్కింపు ఎక్కువ కచ్చితత్వంతో పనిచేస్తుంది.

ఆర్థిక ప్రణాళికలో రూల్ ఆఫ్ 72 ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పదవీ విరమణ కోసం పొదుపు చేయడం, పిల్లల చదువు, సొంత ఇల్లు కొనుగోలు, భవిష్యత్ ఖర్చుల కోసం పెట్టుబడులు పెట్టే వారు తమ లక్ష్యాలను అంచనా వేయడానికి దీనిని ఉపయోగించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక వడ్డీ రేటు ఉన్న పెట్టుబడులు డబ్బును వేగంగా పెంచుతాయి. కానీ అధిక రాబడులతో పాటు రిస్క్ కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అందుకే పెట్టుబడులు పెట్టే ముందు రిస్క్, రాబడులు, కాలపరిమితి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించడం అవసరం. సాధారణ గణిత సూత్రంలా కనిపించే రూల్ ఆఫ్ 72, పెట్టుబడిదారులకు తమ డబ్బు భవిష్యత్తు ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది.