
దేశంలో రైలు ప్రయాణాన్ని ఎక్కువమంది ఇష్టపడతారు. కంఫర్టబుల్‌గా ఉంటుందనే ఉద్దేశంతో దూర ప్రాంతాలకు వెళ్లేవారే ట్రైన్ జర్నీ చేస్తుంటారు. టికెట్ ధరలు తక్కువగా ఉండటంతో పాటు సౌకర్యవంతంగా ఉంటుంది. రైళ్లల్లో జనరల్, స్లీపర్, ఏసీ, చైర్ కార్ వంటి కోచ్‌లు ఉంటాయనే విషయం తెలిసిందే. ప్రతీ కోచ్‌లో టికెట్ల ధరలు వేర్వురుగా ఉంటాయి.

అయితే ఏసీ కోచ్‌లలో రైల్వేశాఖ బెడ్ రోల్ అనేది అందిస్తూ ఉంటారు. బెడ్ షీట్, దుప్పటి, దిండు, టవల్ ఇస్తారు. ఏసీ కోచ్‌లలో ప్రయాణించే ప్రతీఒక్కరికీ ఇది తప్పనిసరిగా అందించాలని రైల్వే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఏసీ ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ బోగీల్లో ప్రయాణించేవారికి వీటిని తప్పనిసరిగా ఇవ్వాలి. టికెట్‌లోనే ఈ బెడ్ రోల్ ఛార్జీలు కలిసి ఉంటాయి. దీంతో ప్రత్యేకంగా వీటికి ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు.

స్లీపర్ క్లాసుల్లో ప్రయాణించేవారు ప్రత్యేకంగా వీటి కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్టాకును బట్టి సిబ్బంది అందిస్తూ ఉంటారు. ఏసీ బోగీల్లో ప్రయాణించేవారికి బెడ్ రోల్ ఇవ్వకపోతే ఫిర్యాదు చేయవచ్చు. రైల్వేశాఖ నుంచి రీఫండ్ కూడా పొందే హక్కు ఉంది. అలాగే ఆర్ఏసీ ప్రయాణికులకు కూడా తప్పనిసరిగా అందించాలి. ఈ మేరకు రైల్వే నిబంధనలు ఉన్నాయి.

మీకు బెడ్ రోల్ అందించకపోతే ముందుగా కోచ్ అటెండర్‌ను సంప్రదించాలి. అయినా ఇవ్వకపోతే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయాలి. నిర్ణీత గడవులోగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. దీంతో మీరు దిగాల్సిన స్టేషన్ వద్ద రూ.20 రీఫండ్ పొందవచ్చు. ఇది చిన్న మొత్తమే అయినా మీ టికెట్‌లోనే బెడ్ రోల్ ఛార్జీలు కలుపతారు గనుక రైల్వే ప్రయాణికులకు ఈ హక్కు ఉంది. ఇది చాలామందికి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు.

ఇక ఏసీ కోచుల్లోని ఆర్‌ఏసీ ప్రయాణికులకు కూడా తప్పనిసరిగా బెడ్ రోల్ అందించాలి. ఆర్‌ఏసీ ప్రయాణికులకు అందించడం లేదనే విమర్శలు ఇటీవల వినిపిస్తున్నాయి. దీంతో రైల్వేశాఖ అన్ని జోన్లకు ఆదేశాలిచ్చింది. వారి దగ్గర కూడా బెడ్ రోల్ ఛార్జీలు వసూలు చేస్తున్న తరుణంలో తప్పనిసరిగా అందించాలని ఆదేశించింది. వారికి కూడా పూర్తి కిట్ అందించాలని స్పష్టం చేసింది.