
రైల్వే ప్రయాణికులు సరైన సేవలు అందించేందుకు భారతీయ రైల్వే చర్యలు చేపడుతోంది. మరిన్ని సేవలు అందించేందుకు గాను రైల్వే శాఖ మరో ప్రయోగం చేపట్టింది. రైల్వే స్టేషన్‌లలో రిలాక్స్ జోన్ ఏర్పాటు చేసింది. మొదటగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌లో ఐల్యాండ్ ప్లాట్‌ఫామ్‌లో రిలాక్స్ జోన్ ప్రారంభించింది. దీంతో పాటు ఇతర స్టేషన్‌లలో కూడా ఇలాంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది.

అయితే ప్రయాణికులు సేద తీరేందుకు రిలాక్స్ జోన్ ఎంతగానో ఉపయోగపడుతుందని, అందుకే ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని చెబుతోంది రైల్వే శాఖ. స్టేషన్‌లో కొన్ని గంటల ముందుగానే వచ్చిన ప్రయాణికులు, లేదా మరో రైలు ఎక్కేందుకు జంక్షన్‌లో దిగిన ప్రయాణికులు రిలాక్స్ జోన్‌లో సేద తీరవచ్చు. రైల్వే స్టేషన్‌లలో రైలు కోసం ఎక్కువ సమయం కేటాయించేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

రిలాక్స్‌జోన్‌లో అనేక సదుపాయాలున్నాయి. ఏసీ రెస్ట్ ఏరియా, లెగ్ మసాజ్ చెయిర్, ఇంటర్నెట్ సర్ఫింగ్, ప్రింట్ ఔట్, ఫోటో కాపీ సౌకర్యాలు కూడా ఉంటాయి. ట్రావెల్ డెస్క్, బిజినెస్ సెంటర్, మ్యూజిక్, డిస్టర్ట్ కౌంటర్స్, ప్యాక్ ఫుడ్ తదితర సదుపాయాలు ఈ రిలాక్స్ జోన్‌లో ఉంటాయి. రైల్వే ప్రయాణికులకు ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

రిలాక్స్ జోన్ ద్వారా భారతీయ రైల్వేకు ప్రతియేటా రూ.12 లక్షల ఆదాయం లభిస్తోంది. దేశంలోని మరిన్ని ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఇలాంటి రిలాక్స్ జోన్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇలాంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ చెబుతోంది.