
దేశవ్యాప్తంగా అనేక వందే భారత్ రైళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే. రైల్వేశాఖ విడతల వారీగా అన్ని రూట్లల్లో ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను తీసుకొస్తుంది. ప్రయాణికులకు వేగవంతమైన లగ్జరీ ప్రయాణాన్ని ఇవి అందిస్తున్నాయి. వీటికి కొనసాగింపుగా వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా రైల్వేశాఖ తీసుకొస్తుంది. ఇప్పటికే దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రాగా.. త్వరలో మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టనున్నాయి. విమానం తరహాలో వీటిల్లో సౌకర్యాలు ఉన్నాయి.

అయితే వందే భారత్ రైళ్లకు సంబంధించి అనేక విషయాలు హాట్‌టాపిక్‌గా మారుతూ ఉంటాయి. ఈ రైళ్లను నడిపే లోక్ పైలట్ల గురించి తాజాగా ఒక విషయం బయటకొచ్చింది. వీరిని ఎలా ఎంపిక చేస్తారు..? జీతం ఎంత ఉంటుంది..? అర్హతలు ఏంటి..? ఎలాంటి సదుపాయాలు ఉంటాయి? అనే విషయాలు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. అయితే వందే భారత్ రైళ్లను నడిపే లోక్ పైలట్లను నేరుగా ఎంపిక చేయరు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వీరిని ఎంపిక చేస్తోంది. ముందుగా అసిస్టెంట్ లోక్ పైలట్‌గా నియమిస్తారు.

అసిస్టెంట్ లోక్ పైలట్‌గా ఎంపికైనవారు కొన్నేళ్ల పాటు సాధారణ రైళ్లను నడపాల్సి ఉంటుంది. అనుభవం వచ్చిన తర్వాత ట్రాక్ రికార్డును అంచనా వేసి వందే భారత్ రైళ్లు నడిపేందుకు అవకాశం కల్పించారు. వీరికి మందుగా ప్రత్యేక ట్రైనింగ్ అందిస్తారు. అనంతరం వందే భారత్ రైళ్లకు లోక్ పైలట్‌గా నియమిస్తారు. బాగా అనుభవం, ట్రాక్ రికార్డు ఉన్నవారికి మాత్రమే రైల్వేశాఖ అవకాశం కల్పిస్తోంది. ప్రీమియం రైళ్లు కావడంతో అనేక భద్రతా చర్యలను తీసుకుంటుంది.

అసిస్టెంట్ లోక్ పైలట్‌కు తొలుత రూ.19,900 బేసిక్ పే ఉంటుంది. ఇతర అలవెన్సులు కలిపితే మొత్తం రూ.35 వేలు నుంచి రూ.40 వేల మధ్య అందుతుంది. అనుభవం వచ్చే కొద్ది వాళ్లు పనిచేసే పనివేళలను బట్టి నెలకు రూ.లక్ష లేదా అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. ఇక జీతంతో పాటు డీఏ, హెచ్‌ఆర్ఏ, రన్నింగ్ అలవెన్స్, రవాణా భత్యం వంటి అదనపు అలవెన్సులు లభిస్తాయి. ఇక హెల్త్ ఇన్యూరెన్స్, పెన్షన్, పెయిడ్ లీవ్స్, ప్రయాణ రాయితీలు వంటి బెనిఫిట్స్ ఉంటాయి.

లోక్ పైలట్ అవ్వాలంటే ఖచ్చితంగా పదో తరగతి పాస్ అయి ఉండాలి. దీంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ , ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసినవారు కూడా అర్హులు. ఇక వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రాతపరీక్షలో ఉత్తీర్ణులైనవారికి మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు.