ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్.. సంస్థతోపాటు.. ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తంలో నగదు ఈపీఎఫ్ఓలో జమవుతుంది. దీనిని అవసరాల కోసం.. EPFO మార్గదర్శకాలకు అనుగుణంగా నగదును తీసుకోవచ్చు. అయితే, ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల కోసం ఎన్నో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
నగదు తనిఖీతోపాటు.. విత్ డ్రా, ఇంకా పలు సేవలను సులభతరం చేసింది. అయినప్పటికీ.. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) సమాచారం తెలుసుకోవాలనుకుంటున్న ఖాతాదారులకు సర్వర్ కష్టాలు తప్పడం లేదు. ఈపీఎఫ్‌ఓ పాస్‌బుక్ సేవలు, ఇంకా పలు రకాల సహాయాలను పొందేందుకు చందాదారులు గత 15 రోజులుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఇప్పటి వరకు ఉన్న ఈపీఎఫ్‌ఓ పాస్‌బుక్ సేవలను భవిష్య నిధి సంస్థ ఇటీవల అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన పాస్‌బుక్‌లో సర్వీసు వివరాలు, పింఛను, వ్యక్తిగత, తదితర వివరాలు తెలుసుకునే లెక్కింపు సాఫ్ట్‌వేర్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట పేరిట సర్వర్ తరచూ నిలిచిపోతుండటంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈపీఎఫ్ అకౌంట్లో ఎంత నగదు నిల్వ ఉంది..? ఇప్పటివరకు ఉపసంహరించుకున్న మొత్తం ఎంత.. ? 2021-22 ఏడాదికి వడ్డీ ఎంత జమ అయింది? తదితర వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారినట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు.
గతంలో పాస్‌బుక్ అప్‌డేట్ చేసిన సమయంలో చాలామంది ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు, నామినీ లాంటి వివరాల్లో తప్పులు దొర్లాయి. వాటిని సవరించినప్పటికీ ప్రస్తుతం సర్వర్ సమస్యలు వెంటాడుతుండం ఇబ్బందులకు గురిచేస్తోంది.
ఇంకా అధిక పింఛను కోసం దరఖాస్తు చేసేందుకు సైతం అర్హులైన చందాదారులు సర్వర్ డౌన్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు నిర్దేశించిన గడువు మే 3వ తేదీతో ముగియనుండంటంతో ఉద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సర్వర్ డౌన్ సమస్య ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. 12రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.