
ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారికి పీఎఫ్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇటీవల కేంద్రం పీఎఫ్ విషయంలో అనేక మార్పులు చేస్తోంది. ఉద్యోగులకు ఉపయోగపడేలా నూతన మార్పులను అమల్లోకి తెస్తోంది. పీఎఫ్ ట్రాన్స్‌ఫర్, నగదు విత్ డ్రా, అమౌంట్ సెటిల్మెంట్ వంటి విషయాల్లో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వీటి గురించి ప్రతీ ఒక్క పీఎఫ్ ఖాతాదారుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే. కొత్త నిబంధనలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

పీఎఫ్ క్లెయిమ్స్‌కు సంబంధించి ఆటో సెటిల్మెంట్ విధానాన్ని ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టింది. పీఎఫ్ ముందస్తు ఉపసంహరణ, ఫైనల్ సెటిల్మెంట్ క్లెయిమ్స్ మరింత వేగంగా ప్రాసెస్ అవుతాయి. ఇందుకోసం ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ మెకానిజంను ప్రవేశపెట్టింది. రూ.5 లక్షల వరకు క్లెయిమ్స్ ఈ విధానంలో ప్రాసెస్ అవుతాయి. మూడు రోజుల్లోనే అకౌంట్లో నగదు జమ అవుతాయి.

ఇక ఉమాంగ్ యాప్‌లో మాత్రమే యూఏఎన్ యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఈపీఎఫ్ఓ వెబ్ సైట్‌లో కూడా ఈ ఆప్షన్ అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు అందులో తొలగించి ఉమాంగ్ యాప్‌లో మాత్రమే చేసుకునేలా పరిమితం చేశారు. ఆధార్ బేస్డ్ ఫేస్ అధెంటికేషన్ ఫీచర్ ద్వారా యూఏఎన్ మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు.

ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మాన్యువల్‌గా ఇది చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి ఇది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఆధార్‌తో యూఏఎన్ లింక్ అయినప్పుడు మీరు వేరే కంపెనీకి మారినా ఆటోమేటిక్‌గా పాత అకౌంట్లోని నగదు కొత్త కంపెనీలోకి బదిలీ అవుతుంది. దీని వల్ల పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ కోసం ప్రత్యేక అకౌంట్ అవసరం ఉండదు.

పీఎఫ్ క్లెయిమ్స్ వేగవంతంగా సెటిల్ చేసేందుకు త్వరలో యూపీఐ బేస్డ్ విత్ డ్రా ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా నిమిషాల్లోనే పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌ఓకు మీ యూపీఐను లింక్ చేసి నగదు తీసుకోవచ్చు. ఇక త్వరలో ఈపీఎఫ్ కనీస వేతన పరిమితిని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.