ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. ప్రజల డబ్బును దోచుకునేందుకు సైబర్ నేరస్థులు ఎప్పటికప్పుడూ సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. చాలా మంది వారి ఉచ్చులో పడి కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటున్నారు. అయితే, సైబర్ నేరగాళ్లు ఇప్పుడు EPFO సబ్‌స్క్రైబర్ల ఖాతాలపై కన్నేశారని.. జాగ్రత్తగా ఉండాలంటూ పీఎఫ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారుల పరంగా, చేపట్టిన ఆర్థిక లావాదేవీల పరంగా ప్రపంచంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఒకటిగా ఉంది. ఎల్లప్పుడూ సంస్థ చందాదారులకు సహాయం చేయడమే కాకుండా.. వారి ప్రయోజనాల కోసం వివిధ రకాల సేవలను అందిస్తుంది.
ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా EPFO సభ్యులకు సహాయపడే లక్ష్యంతో.. సంస్థ ఇది అందరికీ తాజా హెచ్చరికను జారీ చేసింది. ఈ మేరకు EPFO ఆన్‌లైన్ స్కామ్ హెచ్చరికను విడుదల చేసింది. UAN/ పాస్‌వర్డ్/ పాన్/ ఆధార్/ బ్యాంక్ ఖాతా వివరాలు/OTP లేదా ఏదైనా ఇతర వ్యక్తిగత లేదా ఆర్థిక వివరాలను ఎవరితోనూ షేర్ చేయొద్దంటూ సూచించింది.
EPFO లేదా సంస్థ సిబ్బంది ఈ వివరాలను సందేశాలు, కాల్‌లు, ఈ-మెయిల్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ అడగరంటూ సూచించింది.
అలాంటి ఫేక్ కాల్స్/మెసేజ్‌ల పట్ల జాగ్రత్త వహించాలంటూ పేర్కొంది. ఏమైనా కాల్స్, లేదా మెస్సెజ్ లు వస్తే స్థానిక పోలీసు/సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేయాలంటూ ఈపీఎఫ్ఓ పేర్కొంది.
ఇంకా మొబైల్స్ కు వచ్చే ఫేక్ లింకులతో కూడా జాగ్రత్తగా ఉండాలని ఈపీఎఫ్ఓ అధికారులు పేర్కొంటున్నారు. ఏమైనా సందేహాలుంటే అధికారిక సైట్ లో కానీ.. బ్రాంచ్ లో కానీ నివృత్తి చేసుకోవాలంటూ సూచిస్తున్నారు.