
సిగరెట్ తాగేవారికి బిగ్ షాక్. దేశంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సిగరెట్ ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై కేంద్ర ప్రభుత్వం పన్నులను భారీగా పెంచింది. దీంతో ఈ నెల నుంచి సిగరేట్ల బ్రాండ్ల ధరలు పెరిగాయి. ఈ క్రమంలో సిగరెట్ అలవాటు ఉన్నవారికి బడ్జెట్ పెరగనుంది. ఏయే సిగరెట్ ధరలు ఎంత పెరిగాయో ఇప్పుడు చూద్దాం.

ఈ పెంపుతో స్టెల్లార్ డిఫైన్ 20 సిగరెట్ల ప్యాక్ గతంలో రూ.280 ఉండగా.. ఇప్పుడు రూ.380కి పెరిగింది. అంటే దాదాపు 90 శాతం మేర పెరిగింది. ఇక 10 గోల్డ్ స్మాల్ సిగరెట్ల ధర రూ.95 నుంచి ఏకంగా రూ.140కి పెరిగింది. అంటే దాదాపు 47 శాతం పెరుగుదల నమోదు చేసింది.

సిగరెట్ పొడవు, ఫిల్టర్‌ను బట్టి బడ్జెట్ పన్ను శ్లాబులను పొగాకు ఉత్పత్తులపై సవరించారు. ఇక వాటిపై సెస్ పెంచడంతో సిగరెట్ తయారీ కంపెనీలపై పన్ను భారం పెరిగింది. దీంతో కంపెనీలు ఈ అదనపు ఖర్చులను నేరుగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి. దీంతో రూ.10 విలువ చేసే సిగరెట్ రూ.13కి పెరిగింది.

ఇక 75 నుండి 85 మిమీ సిగరెట్ల ధరలు 22 నుండి 28 శాతం పెరిగాయి. దేశంలో ధూమపానం వల్ల ఎన్నో కుటుంబాలను నష్టపోతున్నాయి. ధూమపానం వల్ల క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు రావడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ధరలు పెంచడం వల్ల ధూమపానంకు దూరం అవుతారని కేంద్రం భావిస్తోంది.

ఇక తొలిసారి ధూమపానం చేసేవారు, యువత సిగరెట్ల బారిన పడకుండా చేసేందుకు వాటిని ఖరీదైనవిగా చేశారు. పొగాకు వాడకాన్ని తగ్గించడానికి అధిక పన్నులు విధించడం ఒక కారణమని అంటున్నారు. 2017 నుంచి పొగాకు ఉత్పత్తులపై 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తుండగా.. ఇప్పుడు 40 శాతానికి పెంచారు.