
ఇప్పుడంటే బంగారం ధర భారీగా పెరిగిపోయింది కానీ, దాదాపు 100 సంవత్సరాల క్రితం ఎంత ఉండేదో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అంత తక్కువ ఉంటే మన ముత్తాత కొంత బంగారం కొని ఉంచితే ఎంత బాగుండేదో కదా అని బాధపడేంత తక్కువగా ఉంది. అప్పుట్లో బంగారం అంటే కేవలం అలంకరణ కోసం మాత్రమే వాడేవారు.

అదే బంగారం భవిష్యత్తు తరాలకు భారీ ఆస్తిగా మారుతుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. నేడు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.144,000 ఉన్నప్పుడు ఉంటుందని తెలిస్తే అప్పట్లో కిలోల కొద్దీ బంగారం కొని ఉంచేవాళ్లు. ఇంతకీ 100 ఏళ్ల క్రితం అంటే 1925లో బంగారం ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

1925లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.19. ఆ సమయంలో సగటు వ్యక్తికి ఇది చిన్న మొత్తం కాదు. అయినప్పటికీ పెళ్లిళ్లకు లేదా ఇతర కార్యక్రమాల కోసం ప్రజలు బంగారం కొనేవారు. 1940 ప్రాంతంలో బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.36 నుంచి రూ.50లకు పెరిగింది. 1950 నాటికి బంగారం 10 గ్రాములకు దాదాపు రూ.100లకు చేరుకుంది.

1970లలో బంగారం ధరలో స్పష్టమైన పెరుగుదల కనిపించింది. 1970లో పది గ్రాముల బంగారం ధర దాదాపు రూ.184 ఉండేది. 1975 నాటికి అది దాదాపు రూ.540లకు పెరిగింది. ఈ దశాబ్దంలోనే బంగారం పొదుపు మార్గం మాత్రమే కాదు, మంచి పెట్టుబడి కూడా అని ప్రజలు గ్రహించారు. 1980లో బంగారం ధరలు తొలిసారిగా వెయ్యి రూపాయల మార్కును దాటాయి. ఆ సమయంలో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.1,300 ఉండేది. 1990 నాటికి దాదాపు రూ.3,200లకు పెరిగింది.

2000 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.4,400 ఉండేది. ఆ తర్వాత ద్రవ్యోల్బణం, ప్రపంచ సంక్షోభాలు బంగారం ధరను మరింత పెంచాయి. 2010లో బంగారం రూ.18,000 దాటింది. 2020 తర్వాత అది బాగా పెరిగి 2024 నాటికి 10 గ్రాములకు దాదాపు రూ.70,000 కి చేరుకుంది. ఇక 2025 అంటే స్వర్ణానికి స్వర్ణయుగంగా చెప్పవచ్చు. ఏకంగా ధర డబుల్ అయింది. నేడు 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ.144000లుగా ఉంది.