
సూపర్ మార్కెట్లో లభించే బియ్యం రవ్వను నేరుగా వాడకుండా.. మిక్సీ జార్‌లో వేసి కాసేపు పల్స్ మోడ్ లో ఒక్కసారి గ్రైండ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రవ్వ కాస్త ఫైన్‌గా మారడంతో పాటు అందులోనే కాస్తంత పిండి కూడా తయారవుతుంది. ఈ పిండి రవ్వకు సరైన బైండింగ్‌ను ఇచ్చి, ఉండ్రాళ్లు చుట్టేటప్పుడు ఏమాత్రం విరిగిపోకుండా, పగుళ్లు లేకుండా నునుపుగా వచ్చేలా చేస్తుంది. ఇంట్లో బియ్యంతో చేసుకోవాలనుకుంటే బియ్యాన్ని కడిగి, ఆరబెట్టి మిక్సీలో రవ్వలా పట్టుకుని పిండిని జల్లించకుండా అలాగే వాడాలి.

కావలసిన పదార్థాలు: 2 కప్పుల బియ్యం రవ్వ, అరగంట నానబెట్టిన పావు కప్పు పచ్చిశనగపప్పు, ఒక కప్పు రవ్వకు 3 కప్పుల చొప్పున నీళ్లు, 1 టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ ఇంగువ, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, 1 నుండి 2 టీస్పూన్ల నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు

తయారీ విధానం: స్టవ్ వెలిగించి కడాయిలో 2 కప్పుల బియ్యం రవ్వను వేసి రంగు మారకుండా కేవలం వెచ్చబడే వరకు 2 నిమిషాలు వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 6 కప్పుల నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి ఎసరును మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన శనగపప్పును నీరు తీసేసి వేయాలి.

మూతపెట్టి మీడియం మంటపై 5 నిమిషాలు పప్పు పలుకుగా ఉడికే వరకు ఉంచాలి. ఆ తర్వాత జీలకర్ర, ఇంగువ, పచ్చి కొబ్బరి తురుము వేసి కలపాలి. ఇప్పుడు మంటను తగ్గించి, వేయించి పెట్టుకున్న రవ్వను కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలపాలి. ఇందులోనే 2 టీస్పూన్ల నెయ్యి వేసి మూతపెట్టి చిన్న మంటపై నీరంతా పూర్తిగా ఇగిరిపోయే వరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేయాలి.

రవ్వ మిశ్రమం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతిని చల్లటి నీళ్లలో ముంచుతూ నిమ్మకాయ సైజులో నునుపైన రౌండ్ ఉండ్రాళ్లుగా చుట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర లేదా స్టీమర్ ప్లేట్‌కు కొద్దిగా నెయ్యి రాసి, తయారు చేసుకున్న ఉండ్రాళ్లను అమర్చాలి. ఆవిరి వస్తున్న స్టీమర్‌లో ఈ ప్లేట్ ఉంచి మూతపెట్టి మీడియం మంటపై సరిగ్గా 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి.అంతే, పైన మృదువుగా, లోపల పంటికి తగిలే శనగపప్పు క్రంచీనెస్‌తో ఎంతో కమ్మనైన బియ్యం రవ్వ ఉండ్రాళ్లు సిద్ధం! వినాయకుడికి నైవేద్యంగా సమర్పించడానికి ఇది పరిపూర్ణమైన ప్రసాదం.