
అంతర్జాతీయ విమానాల ప్రదర్శనకు హైదరాబాద్ మరోసారి వేదికైంది. ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శనా కార్యక్రమం వింగ్స్ ఇండియా 2024 బేగంపేట విమానాశ్రయంలో గురువారం ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (MOCA) మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండియన్ ఇండస్ట్రీ (FICCI) ఆధ్వర్యంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శనను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఏవియేషన్ పరిశ్రమలో అత్యుత్తమమైనవి తమ వినూత్న విమానయాన సాంకేతికత, విమాన యంత్రాలను ప్రదర్శిస్తాయి. దీని థీమ్ 'అమృత్ కాల్‌లో భారతదేశాన్ని ప్రపంచానికి అనుసంధానించడమని.. ఇది భారత పౌర విమానయానానికి వేదిక అంటూ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, గత రెండేళ్లలో ప్రయాణికుల సంఖ్య 260 మిలియన్‌లు పెరిగిందన్నారు.

రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. వింగ్స్ ఇండియా కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, తెలంగాణ దేశంలోనే ఎంతో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా వారంలో మూడు సార్లు విమాన సౌకర్యం కల్పించాలని జ్యోతిరాదిత్య సింధియాను కోరామని తెలిపారు.

ఇవ్వాల్టి నుంచి హైద్రాబాద్ మహానగరంలో నాలుగురోజుల పాటు (జనవరి 21)ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా ఎయిర్ షో జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం బోయింగ్ 777-9 విమానంతో పాటు అనేక విమానాల ప్రదర్శన జరగనుంది.

ఈ ప్రదర్శనలో 106 దేశాల నుంచి సుమారు 1500 మంది ప్రతినిధులు హాజరుకానుండగా.. దీనికోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అన్ని రకాల విమానాలు వింగ్స్ ఇండియా ప్రదర్శనలో పాల్గొననున్నాయి.

భారత వాయుసేనకు చెందిన సారంగ్ బృందం ఈనెల 18 నుంచి 21 వరకు విన్యాసాలు నిర్వహిస్తుంది. 18న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు, సాయంత్రం 4.15 నుంచి 5, 19న ఉదయం 11 నుంచి 12 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు, సాయంత్రం 4.15-5 వరకు విన్యాసాలు ఉంటాయి.

20, 21వ తేదీల్లో సందర్శకులను అనుమతిస్తారు. దీని టికెట్ రూ.750గా నిర్ణయించారు. ‘బుక్‌మైషో’ యాప్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. మూడేళ్లలోపు పిల్లలకు ఉచితం.