
గోంగూర పచ్చడి (Gongura Pachadi) తయారీ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది. అయితే పర్ఫెక్ట్ కొలతలతో ఈ కింది విధంగా చేస్తే మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు. వేడి అన్నంలో కాస్తంత గోంగూర పచ్చడి వేసుకుని వానాకాలం చల్లని పూట తింటే ఉంటుంది సామీ.. ఇంకెందుకు ఆలస్యం ఆంధ్రా స్టైల్ గోంగూర పచ్చడి ఎలా వండాలో ఇక్కడ తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు.. గోంగూర ఆకులు 4 నుంచి 5 కట్టలు, పచ్చిమిర్చి 8 నుంచి 10, ఎండుమిర్చి 8 నుంచి 12, వెల్లుల్లి రెబ్బలు 10 నుంచి 15, ఉప్పు తగినంత, పసుపు ½ టీస్పూన్, మెంతులు 1 టీస్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీస్పూన్, ఆవాలు 1 టీస్పూన్, మినప్పప్పు 1 టీస్పూన్, శనగపప్పు 1 టీస్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు

గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా ఆరనివ్వాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి గోంగూర ఆకులు, పచ్చిమిర్చి వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఉడికిన గోంగూరలో ఉప్పు, పసుపు, ముందుగా తయారు చేసిన మసాలా పొడి వేయాలి. వెల్లుల్లి రెబ్బలు కలపాలి. ఆ తర్వాత చల్లారనివ్వాలి. మసాలా కోసం మరో పాన్‌లో కొద్దిగా నూనె వేసి మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించి చల్లారనివ్వాలి. వీటిని మిక్సీలో పొడిగా చేసుకోవాలి.

వేయించిన గోంగూర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, మసాలా పొడి వేసి మిక్సీలో పచ్చడిలా గ్రైండ్ చేయాలి. అవసరమైతే కొద్దిగా వెల్లుల్లి ముక్కలు అలాగే ఉంచవచ్చు. తాలింపు కోసం పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. అవి వేగిన తర్వాత గ్రైండ్ చేసిన గోంగూర పచ్చడి వేసి 2 నుంచి 3 నిమిషాలు కలపాలి.

అంతే.. చూస్తేనే నోరూరే గోంగూర పచ్చడి, ఆంధ్రా స్టైల్ స్పెషల్ రుచితో రెడి అయిపోయినట్లే. ఈ గోంగూర పచ్చడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోసె, చపాతీలతో కూడా బాగా సరిపోతుంది. 4, 5 రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంటుంది.