
డయాబెటిస్: అధిక ఆకలికి అత్యంత సాధారణ కారణం డయాబెటిస్. మన శరీరం ఆహారాన్ని గ్లూకోజ్‌గా మారుస్తుంది. కానీ కణాలకు ఈ గ్లూకోజ్ చేరాలంటే ఇన్సులిన్ అవసరం. మధుమేహం ఉన్నవారిలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. దీనివల్ల కణాలకు తగినంత శక్తి అందక శరీరం నిరంతరం ఆహారం కోసం సంకేతాలను పంపుతుంది. ఫలితంగా మీరు ఎంత తిన్నా మళ్లీ ఆకలి వేస్తూనే ఉంటుంది.

థైరాయిడ్ సమస్యలు: థైరాయిడ్ గ్రంథి అతిగా చురుగ్గా ఉన్నప్పుడు, శరీర జీవక్రియ రేటు విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల మీరు తిన్న ఆహారం ద్వారా వచ్చే కేలరీలు చాలా వేగంగా ఖర్చవుతాయి. ఆకలితో పాటు ఆకస్మికంగా బరువు తగ్గడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

ఒత్తిడి - నిద్రలేమి: మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనప్పుడు శరీరం కార్టిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఆకలిని పెంచుతుంది. అలాగే సరిగ్గా నిద్రపోని వారిలో ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ స్థాయిలు పెరిగి ఆకలిని నియంత్రించే లెప్టిన్ హార్మోన్ తగ్గుతుంది. దీనివల్ల అకారణంగా ఆకలి వేస్తుంటుంది.

డీహైడ్రేషన్: ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మన మెదడు కొన్నిసార్లు దాహాన్ని ఆకలిగా తప్పుగా అర్థం చేసుకుంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు కూడా ఆకలిగా అనిపించవచ్చు. అందుకే ఆకలిగా అనిపించినప్పుడు వెంటనే ఆహారం తీసుకోకుండా ఒక గ్లాసు నీరు తాగి చూడండి.

తీసుకోవలసిన జాగ్రత్తలు: మీ ఆహారంలో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇవి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, పంచదార ఎక్కువగా ఉండే పదార్థాలను తగ్గించండి. తరచుగా ఆకలి వేస్తుంటే షుగర్ లెవల్స్, థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి.