కొన్ని వింత విషయాల గురించి చెబితే నమ్మడం చాలా కష్టంగా ఉంటుంది. జోకులు వేసింది చాల్లే.. ఇంకేంటి సంగతులు అంటారు కొంతమంది. నిజమురా బాబు.. కుయ్యో, మొర్రో అన్నా పట్టించుకోరు. ఫైనల్‌గా ఆధారాలతో సహా చూపిస్తే మాత్రం.. ఒకింత ఆశ్యర్యంతో ఇదెలా సాధ్యం అని ఎదురు ప్రశ్నిస్తారు. ఇప్పుడు అటువంటి విషయాన్నే మీ ముందుకు పట్టుకొచ్చాం. పంజాబ్, హర్యానా సరిహద్దులో ఉన్న ఒక ఇంటి గురించి మేం మాట్లాడుతున్నాం. ఆ ఇంటి ఒక చివరి తలుపు పంజాబ్‌లో తెరుచుకుంటే, మరొక చివరి తలుపు హర్యానాలో తెరుచుకుంటుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, నమ్మక తప్పదు.
అది దేశమైనా, రాష్ట్రమైనా, గ్రామమైనా, పంట పండే పొలమైనా ప్రతిచోటా సరిహద్దు ఉంటుంది. సరిహద్దు విషయంలో పెద్ద, పెద్ద గొడవలు అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో సరిహద్దుల కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సరిహద్దు కారణంగా చర్చలో ఉన్న ఓ ఇంటి గురించి మీకు చెప్పబోతున్నాం. 70 ఏళ్ల జగవంతి దేవి తన కుటుంబమంతో కలిసి ధర్మశాల పక్కనే ఉన్న ఇంట్లో నివసిస్తున్నారు. అయితే ఆమె ఇంటి గురించి ఇప్పుడు ఒక పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే, ఆ ఇంటి తలుపు ఒకటి పంజాబ్‌లో, మరొకటి హర్యానాలో తెరుచుకుంటుంది. ఇప్పుడు ఈ ఇంటి మధ్యలో గోడను నిర్మించారు. అయితే, గోడ కట్టడం వెనుక కుటంబ పరమైన విబేధాలు ఏం లేవు. ప్రభుత్వ కార్యాలయంలో కొన్ని పనుల కారణంగా ఇంట్లో నిట్టనిలువునా గోడ కట్టక తప్పలేదు.
సమాచారం ప్రకారం, జగవంతి దేవి కొంతకాలం క్రితం తన ఇంటిని విస్తరించింది. ఫలితంగా, ఆమె నివాసంలో సగం ప్రాంతం హర్యానా రాష్ట్ర పరిధిలోకి వెళ్లింది. ఆమె మూడు నెలల క్రితం విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే, భూమి రిజిస్ట్రీ ఉర్దూలో ఉండటంతొ దీనిపై స్థానిక అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చేసేందేం లేక రిజిస్ట్రీని పంజాబీ భాషలోకి మార్చారు. అలా చేసినా కూడా పని తిన్నగా జరగలేదు. దీంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా రిజిస్ట్రీ ఇంగ్లీషులో తయారుచేశారు. దీంతో తమ ఇంటికి కరెంట్ కనెక్షన్ పక్కా అనుకున్నారు. అయితే దీనిపై విద్యుత్ శాఖ మళ్లీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఇళ్లు రెండు రాష్ట్రాల్లో ఉండటం వల్ల తాము సర్వీసు ఇవ్వలేమని తెలిపింది. బార్డర్ సరిహద్దు గోడను నిర్మించే వరకు కనెక్షన్ ఇవ్వమని స్పష్టం చేసింది. అందువల్ల, జగవంతి దేవి ఇంటి మధ్యలో గోడను నిర్మించక తప్పలేదు. పంజాబ్ నుండి విడిపోయిన తరువాత హర్యానా ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కూడా ఇటువంటి బార్డర్ వివాదాలు చాలా జరిగాయి. మరోసారి ఆ తరహా ఇష్యూ చర్చయానీయాంశం అయ్యింది. ఇంట్లో గోడ నిర్మించడంతో గోడకు అత్తగారు ఒకవైపు, కోడలు మరోవైపు నిల్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండటం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.
Also Read: విశాఖ నరమేధంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ టెర్రర్.. కొత్తగా 2,34,692 కేసులు.. ప్రమాదకరంగా మరణాలు