రైలు ప్రయాణం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత సాధారణ ప్రయాణ మార్గాల్లో ఒకటి. సాధారణ కోచ్, ఏసీ లేదా స్లీపర్ కోచ్ ఇలా రైళ్లల్లో వివిధ కేటగిరీలు ఉంటాయి. భారతదేశంలో రోజూ వేలాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. 2020లో భారతీయ రైల్వే 808.6 కోట్ల మంది ప్రయాణికులను తీసుకువెళ్లిందని గణాంక డేటా చూపిస్తుంది. ఇది దేశానికి జీవనరేఖ అని చాలా మంది నిపుణులు పేర్కొంటూ ఉంటారు. రైళ్లల్లోని సాధారణ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించడానికి సాధారణంగా ముందస్తు రిజర్వేషన్ అవసరం లేదు. స్టేషన్ కౌంటర్ నుంచి టిక్కెట్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే చాలా మంది వ్యక్తులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ముందు వేరే రైలులో ప్రయాణించడానికి ఒకే తరహా సాధారణ టిక్కెట్‌ను ఉపయోగిస్తారు. అయితే ఇలా చేయకూడదని రైల్వే నిబంధనలు పేర్కొంటున్నాయి. అలాగే ఈ విషయంపై భారతీయ రైల్వే నిర్దేశించిన మార్గదర్శకం ఉంది. ఈ నియమాలు పెద్ద సంఖ్యలో ప్రజలకు తెలియవు. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఎక్స్ ప్రెస్ రైలు అయినా, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైలు అయినా రైలు కేటగిరీకి అనుగుణంగా కొనుగోలు చేసిన జనరల్ టికెట్‌తో వేరే ఏ రైలు అయినా ఎక్కొచ్చని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ వాదన తప్పని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఎవరైనా టిక్కెట్ కొనుగోలు చేసిన రైలులో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. కొంతమంది రైళ్లను మారుతూ ఉంటారు. కానీ అలాంటి వారు పట్టుబడితే వారు భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల జనరల్ టిక్కెట్‌పై రైళ్లను మార్చడం మానుకోవాలని నిపుణులు సూచించారు.
అయితే ఈ విషయంలో లోకల్ రైళ్లకు కొంత వెసులుబాటు ఉంది. టిక్కెట్టు కొనుగోలు చేసినప్పుడల్లా స్టేషన్ పేరు, కొనుగోలు సమయం రాసి ఉంటుంది. సాధారణ టిక్కెట్‌కి కాలపరిమితి ఉంటుంది, ఆ తర్వాత అది చెల్లదు. ఎవరైనా ఢిల్లీ లేదా ముంబై వంటి సిటీ స్టేషన్‌లో జనరల్ టిక్కెట్‌ను కొనుగోలు చేస్తుంటే, దాని వాలిడిటీ కేవలం 1 గంట మాత్రమే ఉంటుంది. అంటే వారు టికెట్ కొనుగోలు చేసిన తర్వాత గంటలోపు ఏదైనా రైలు పట్టుకుని అక్కడి నుంచి బయలుదేరాలి. ఇది చిన్న పట్టణంలోని స్టేషన్ అయితే సాధారణ టిక్కెట్‌పై స్టేషన్ నుంచి నిష్క్రమించాల్సిన సమయం మూడు గంటల వరకూ ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.