
ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న వారిని, దేశ భద్రతను ఉల్లంఘించే వారిని న్యూ ఇండియా ఇకపై విడిచిపెట్టదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం అన్నారు. కేంద్ర ప్రభుత్వ భద్రత, సుపరిపాలన విధానం పూర్తిగా “జీరో టాలరెన్స్”పై ఆధారపడి ఉందని, అటువంటి అంశాలకు వారి స్వంత భాషలోనే సమాధానం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. లఖింపూర్ ఖేరీలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. “న్యూ ఇండియా ఎవరినీ ఇబ్బంది పెట్టదు, కానీ ఎవరైనా మా దేశానికి వ్యతిరేకంగా దుష్ప్రవర్తన చేస్తే, దానిని కఠినంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి” అని అన్నారు.
“మన సమాజంలో ఉగ్రవాదం, అరాచకత్వానికి చోటు ఉండకూడదు” అని కూడా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. పహల్గామ్ దాడిని ఖండిస్తూ, “మతపరమైన గుర్తింపు ఆధారంగా అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం సహించరానిది. మహిళలను వితంతువులుగా చేయడం, వారి మతం గురించి అడిగిన తర్వాత వారిని చంపడం ఇండియాలో ఆమోదయోగ్యం కాదు” అని అన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడిన కొన్ని రోజుల తర్వాత మోగి పై విధంగా స్పందించారు. ఈ దాడి తర్వాత, ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధాలలో మరోసారి ఉద్రిక్తత కనిపించింది. ఈ సంఘటన తర్వాత ఇండియా సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడంతో సహా అనేక కఠినమైన చర్యలు తీసుకుంది, పాకిస్తాన్ కూడా భారత విమానాలకు తన గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి