మహిళా రిజర్వేషన్లపై మళ్లీ రగడ.. ఈ సారి పార్లమెంట్ సమావేశాల్లో ఏం జరగబోతుంది
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం మరోసారి దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం లోక్‌సభ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల్లో ఉన్న స్థానాల సంఖ్య ఆధారంగానే మహిళా రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పట్టుబడితే.. లోక్‌సభ స్థానాలను పెంచి, నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం, ప్రతిపక్షాల మధ్య మరోసారి రాజకీయ వాగ్వాదం మొదలైంది.

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అంశంపై మళ్లీ రాజకీయ రగడ రాజుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య మహిళా రిజర్వేషన్ల అంశంపై మాటల యుద్ధం జరిగిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు సిద్ధమైంది. నవంబర్ 30న లోక్‌సభ, డిసెంబర్ 2న రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు అవసరమైన నియోజకవర్గాల పునర్విభజనపై ప్రభుత్వం ఈ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకోనుంది.
గత ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ సెషన్స్‌లో రాజ్యాంగ సవరణలకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో ఈ బిల్లు అమల్లోకి రాలేదు. కానీ ఈసారి ఎలాగైనా ప్రాంతీయ పార్టీల మద్దతుతో బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా, మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే.. లోక్‌సభ స్థానాలను పెంచడం వల్ల ఎంపీలు ప్రాతినిధ్యం వహించే జనాభా నిష్పత్తి మెరుగుపడుతుందని బీజేపీ చెబుతోంది.
అమిత్ షా వర్సెస్ రాహుల్ గాంధీ
మహిళా రిజర్వేషన్ల అమలును కాంగ్రెసే అడ్డుకుంటోందని కేంద్ర మంత్రి అమిత్ షా ఆరోపించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పెండింగ్‌లో ఉంచిందని విమర్శించారు. దేశ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం బీజేపీ, ప్రధాని మోదీ సంకల్పమని, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.
అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తోంది. 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారిందని, ప్రస్తుత పార్లమెంట్ స్థానాల్లోనే దానిని అమలు చేయవచ్చని చెబుతోంది. మహిళా రిజర్వేషన్లను సాకుగా చూపిస్తూ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది.
పోస్ చూడండి..
#WATCH | Delhi: Union Home Minister Amit Shah says, “The constitutional amendment providing 33 per cent reservation to women in Parliament and State Assemblies- the Congress party has been sitting on it and blocking it. Today, I want to tell Rahul ji: it is the resolve of the Bharatiya Janata Party and our leader Narendra Modi that the women of this country will definitely get 33 per cent reservation; you cannot stop us.”
— ANI (@ANI) November 26, 2026
850కి పెరగనున్న లోక్‌సభ స్థానాలు?
ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బిల్లు ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్య 850కి పెరుగుతుంది. ఇందులో సుమారు 283 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాల్సి వస్తుంది. ఈ స్థానాలను రొటేషన్ పద్ధతిలో కేటాయించనున్నారు. అంతేకాకుండా నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్ణయించేందుకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి కల్పించనున్నారు.
అయితే డీలిమిటేషన్ వల్ల అధిక జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ స్థానాలు దక్కి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై గతంలో స్పందించిన అమిత్ షా.. ప్రతి రాష్ట్రంలోనూ ప్రస్తుత లోక్‌సభ స్థానాలను 50 శాతం చొప్పున పెంచే ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించవచ్చని తెలిపారు. కానీ ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన బిల్లు ముసాయిదాలో ఈ అంశాన్ని చేర్చలేదు. మరి ఈసారైనా ఈ అంశాన్ని ప్రవేశపెట్టే బిల్లులో చేరుస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
మెజారిటీ కోసం కేంద్రం ప్రయత్నాలు
కేంద్రం అనుకున్నట్టు రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ కచ్చితంగా కావాల్సిందే. అంటే ఈ బిల్లుకు 360 మంది ఎంపీల మద్దతు కావాలి. కానీ ఎన్డీఏ కూటమికి 319 మంది ఎంపీల సపోర్ట్ మాత్రమే ఉంది. అయితే బిల్లు ఆమోదం పొందాలంటే ఎన్డీఏకు ఇంకా 41 మంది ఎంపీల సపోర్ట్ కావాలి. ఒకవేళ శరద్ పవార్ ఎన్సీపీ వర్గానికి చెందిన 8 మంది ఎంపీలు ఎన్డీఏకు సపోర్ట్ చేస్తే ఈ సంఖ్య 327కి (లేదా ఇతరులతో కలిపి 328కి) చేరే ఛాన్స్ ఉంది. అయితే తమ సపోర్ట్ కావాలంటే ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలను 50 శాతం చొప్పున పెంచాలని వారు ప్రతిపాదించినట్టు సమాచారం.
డీఎంకే మద్దతు కీలకం!
ఇక ఎన్డీఏ కూటమికి ఉన్న మరో ఆప్షన్ ఏమిటంటే.. డీఎంకే సపోర్ట్. తమిళనాడులోని డీఎంకే పార్టీలో ప్రస్తుతం 22 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏకు వీరి మద్దతు కనుక లభిస్తే ఎంపీల సంఖ్య 349కి (లేదా ఇతరులతో కలిపి 351కి) చేరుతుంది. అయినా మెజారిటీ కావాలంటే ఇంకో 10 మంది ఎంపీల మద్దతు కావాలి. అయితే డీఎంకే కూడా తమ మద్దతు కావాలంటే ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు 50 శాతం పెంచాలని కోరుతున్నట్టు సమాచారం.
ఇక మొత్తంగా చూస్తే ఈసారి పార్లమెంట్ సెషన్స్‌లోనూ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అంశంపై చర్చలు వాడీవేడిగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఈసారైనా కేంద్రం అవసరమైన మెజారిటీని సాధిస్తుందా? లేదా అని.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
