Corona Pandemic: కరోనా మహమ్మారి..ప్రాణాలు తీసేయడమే కాదు.. మనుషుల మధ్య ఉండే ఎమోషన్స్ ను కూడా ఆటాడేసుకుంటోంది. రెండో వేవ్ ప్రారంభంయ్యకా మరణాల సంఖ్యా పెరిగిపోతోంది. ఇది ఎప్పుడు ఆగుతుందో.. ఎలా ఆగుతుందో కూడా ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. ఇక ఊరు కాని ఊరు.. దేశం కాని దేశంలో ఉన్నవారికి కరోనా సోకితే.. వారి అనుభవం అతి భయంకరంగా ఉంటుంది. ఇక దూరంగా ఉన్న వారి కుటుంబ సభ్యుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వారి పాట్లు ఎవరికీ చెప్పనలవి కానివిగా ఉంటాయి. అలా కరోనా సోకిన వ్యక్తి చనిపోతే.. ఆ వ్యక్తి బంధువులకు కలిగే మానసిక వేదనకు ఎవరూ సమాధానం చెప్పలేరు. ఇటీవల ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది. మధ్యప్రదేశ్ ఇండోర్ లో చోటు చేసుకున్న ఈ సంఘటన ప్రతి మనసునూ మేలిపెట్టేస్తోంది. ఆ సంఘటన వివరాలివి..
మధ్యప్రదేశ్ కు చెందిన మనోజ్ శర్మ చైనాలో బ్యాంకర్ గా పనిచేస్తున్నారు. ఆయన తన భార్యతో అక్కడే ఉంటున్నారు. ఇటీవల ఇండోర్ లో తన బంధువులకు ఆరోగ్యం బాగాలేదని వారిని చూడటం కోసం ఇండియా వచ్చారు మనోజ్ శర్మ. ఆయన భార్య మాత్రం అక్కడే చైనాలోనే ఉండిపోయారు. ఇండోర్ వచ్చిన మనోజ్ శర్మకు సోమవారం కరోనా సోకింది. దీంతో ఆయనను అరబిందో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో వైద్య సహాయం కోసం చేర్పించారు. ఒక రోజు అనంతరం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన భార్య చైనా నుంచి వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఆమె అన్నీ సరిచూసుకుని వచ్చేవరకూ మనోజ్ మృత దేహాన్ని భద్రపరిచే అవకాశమూ లేదు. దీంతో ఆయన అంత్యక్రియలు ఇండోర్ లోని ఒక సోషల్ వర్కర్ పూర్తి చేశారు. దీనికోసం మనోజ్ భార్య చైనా నుంచి ఆమోదం తీసుకున్నారు ఇండోర్ పోలీసులు. ఆమె నుంచి ఆన్లైన్ లో ఆమోదం తీసుకున్నామని అక్కడి సీనియర్ పోలీస్ ఆఫీసర్ ప్రశాంత్ చౌబే పీటీఐతో చెప్పారు.
ఇదిలా ఉంటే, మనోజ్ శర్మ మృత దేహాన్ని చైనాకు తీసుకువెళ్లలేక.. ఇక్కడ అంత్యక్రియలకు హాజరు కాలేక ఆయన భార్య పడిన వేదన వర్ణనాతీతంగా మారింది. మనోజ్ అంత్యక్రియలను ఆమె వీడియో కాల్ ద్వారా చూశారు. హృదయాన్ని కదిలించి వేస్తున్న ఈ అంత్యక్రియల దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
మరోవైపు మధ్యప్రదేశ్ లో గత 24 గంటల్లో 12,727 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా 77 మంది చనిపోయారు. ఇప్పటివరకూ మధ్యప్రదేశ్ లో మొత్తం 4,713 మంది కరోనాతొ చనిపోయారు. ప్రస్తుతం అక్కడ కరోనా కర్ఫ్యూ అమలులో ఉంది. ఇది ఏప్రిల్ 26 వరకూ కొనసాగుతుంది.
Also Read: Triple Mutation Variant: భారత్‌లో కరోనా విశ్వరూపం.. తాజాగా మరో కొత్త వేరియంట్ గుర్తింపు..
Vaccine for Eighteen: పద్దెనిమిది ఏళ్లకు టీకా..అమూల్ టచ్ తో ప్రచారం..అదిరింది అంటున్న నెటిజనం!