
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల్లో ఎదురైన పరాజయంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను ఎన్నికల్లో ఓడిపోలేదని, దాదాపు 100 స్థానాల్లో ఓట్ల రిగ్గింగ్ జరిగిందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ పోరాటం కేవలం భారతీయ జనతా పార్టీతోనే కాదని, పక్షపాతంతో వ్యవహరించిన ఎన్నికల సంఘంతో కూడా తలపడాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘం తీరును మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. “ఎన్నికల సంఘం పూర్తిగా ఢిల్లీ నాయకత్వం కనుసన్నల్లో పనిచేస్తోంది. వారు తమను తాము అమ్ముకున్నారు. కౌంటింగ్ కేంద్రాలను హైజాక్ చేసి, ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేశారు,” అని ఆమె ధ్వజమెత్తారు. రెండు దశల ఎన్నికల తర్వాత కావాలనే తమ పార్టీ నాయకులను అరెస్టు చేయడం, అధికారులను బదిలీ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన బ్యూరోక్రాట్లను తీసుకువచ్చి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసిందని మమత మండిపడ్డారు.
రాజీనామా ప్రసక్తే లేదుః మమతా
తాను రాజీనామా చేయడానికి లోక్ భవన్ (రాజ్ భవన్)కు వెళ్లే ప్రసక్తే లేదని దీదీ స్పష్టం చేశారు. “నేను ఎందుకు రాజీనామా చేయాలి? వారు అధికారాన్ని అడ్డదారిలో చేజిక్కించుకున్నారు. నేను ఎప్పుడూ వీధుల్లోనే ఉండే వ్యక్తిని, ఇప్పుడూ వీధుల్లోనే ఉండి పోరాడుతాను,” అని ఆమె తెగేసి చెప్పారు. ఒక మహిళా ముఖ్యమంత్రి అని చూడకుండా తనను బూత్ నుండి బయటకు నెట్టేశారని, సాక్షాత్తూ తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు.
ఈ సంక్షోభ సమయంలో ‘ఇండియా’ (INDIA) కూటమి నాయకులు తనకు అండగా నిలిచారని మమత తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ థాకరే, హేమంత్ సోరెన్ వంటి నాయకులు తనతో మాట్లాడారని, అఖిలేష్ యాదవ్ తనను కలవడానికి వస్తున్నారని వెల్లడించారు. 2004లో కూడా ఇటువంటి అణచివేతను తాను చూడలేదని ఆమె వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, హర్యానాలో కూడా ఇదే తరహాలో గెలిచారని, కానీ తాము పులుల్లా పోరాడుతామని మమత బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు.
జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు 10 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తుందని చెప్పారు. తమ పార్టీ కార్యాలయాలను స్వాధీనం చేస్తున్నారని, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. “ఇది బెంగాల్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. బలప్రయోగంతో మమ్మల్ని ఓడించారు. కానీ మేము తిరిగి పుంజుకుంటాము,” అని మమత హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష పాలన కోరుకుంటోందని, ఇది ప్రపంచవ్యాప్తంగా తప్పుడు సందేశాన్ని పంపుతోందని ఆమె ముగించారు. బెంగాల్ గడ్డపై ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
VIDEO | Addressing a press conference after the defeat in the West Bengal Elections 2026, TMC supremo Mamata Banerjee says, "So now we have decided that, regarding the Election Commission and the mechanisms they have used, we will not disclose our strategy at this moment. We will… pic.twitter.com/JqVDoo7cqA
— Press Trust of India (@PTI_News) May 5, 2026