
అహ్మదాబాద్‌లో మృతదేహాలకు DNA ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు నిపుణులు DNA పరీక్షల ద్వారా 86 మృతదేహాలను గుర్తించారు. ఇప్పటిదాకా 33 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. DNA పరీక్షలో దంతాలు, ఎముకలు కీలకం కావడంతో.. 600 మంది డాక్టర్లు, అసిస్టెంట్లు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. ఇటు డెడ్‌బాడీల అప్పగింతలో సిబ్బందితో పాటు డ్రైవర్లూ పాల్గొంటున్నారు. భారీ పేలుడు వల్ల వెయ్యి డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యి ప్రయాణికులు మాంసపు ముద్దలవ్వడంతో DNA పరీక్షలు కాస్త సవాల్‌గా మారాయంటున్నారు వైద్యులు.. ఒక్కో డీఎన్ఏ పరీక్షకు 26 నుంచి 48 గంటల సమయం పడుతున్నట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా మృతదేహాలను గుర్తించి వారి బందువులకు అప్పగించేందుకు శ్రమిస్తున్నామన్నారు. మూడు షిఫ్టుల్లో దాదాపు 600 మంది డాక్టర్లు, అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. అంతేకాకుండా.. వందలాది మంది సిబ్బంది కూడా పనిచేస్తున్నారు.
ఇటు DNA పరీక్షలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. విజయ్ రూపానీ కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన నమూనాలతో, ప్రమాద స్థలంలో లభ్యమైన ఓ మృతదేహం డీఎన్‌ఏ సరిపోలిందని, దీంతో అది రూపానీదేనని నిర్ధారించుకున్నామని FSL డైరెక్టర్ సంఘ్వీ తెలిపారు. విమానంలో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహాన్ని డీఎన్ఏ నమూనాల ద్వారా గుర్తించినట్లు గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ ధృవీకరించారు. రూపానీ కుమారుడు రిషబ్ రూపానీ శనివారం తన డీఎన్ఏ నమూనాను సమర్పించారు. అయితే.. మాజీ ముఖ్యమంత్రి అంత్యక్రియలు సోమవారం రాజ్‌కోట్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయని మంత్రి ప్రకటించారు. ఉదయం 11.30 గంటలకు సివిల్ హాస్పిటల్ నుంచి ఆయన భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు తీసుకెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని అధికారులు తెలిపారు.
అహ్మదాబాద్ ప్రమాదంలో 279 మంది మరణించినట్లు పేర్కొంటున్నారు. అయితే.. మృతుల సంఖ్యపై కేంద్రం ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎంతమంది చనిపోయారన్నది ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. ఫ్లైట్‌లో చనిపోయినవారిని మాత్రమే ప్రకటించింది కేంద్రం. మరీ ప్రమాదంలో ఇంటర్న్ మెడికోలు ఎంతమంది చనిపోయారు..? స్థానికులు ఎంతమంది ఉన్నారు…? ఇప్పుడివే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా.. ఆదివారం నాడు బోయింగ్ 787-7 విమానం బ్లాక్ బాక్స్ నుండి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను కూడా రెస్క్యూ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయని అధికారులు తెలిపారు.. ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..