
స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన ‘వందేమాతరం’ గేయానికి నేటితో 150 ఏళ్లు. ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశ రాజధాని డిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో స్మారక కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఒక తపాలా బిళ్ళ, నాణెంను కూడా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ కీలక ప్రసంగం చేశారు. ఈ స్మారక కార్యక్రమం నవంబర్ 7, 2025 నుండి నవంబర్ 7, 2026 వరకు దేశవ్యాప్తంగా జరుగుతుంది. వందేమాతరం అనేది కేవలం ఒక పదం కాదు, ఒక సంకల్పం కూడా అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జాతీయ గీతం మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని అన్నారు. సాధించలేని సంకల్పం ఏదీ లేదని ఆయన అన్నారు. వందేమాతరం అనేది సరస్వతి దేవికి చేసే ప్రార్థన. వందేమాతరం భవిష్యత్తుకు ధైర్యాన్ని కూడా ఇస్తుందని ఆయన అన్నారు.
“వందేమాతరం, ఈ పదాలు ఒక మంత్రం, ఒక శక్తి, ఒక కల, ఒక సంకల్పం. వందేమాతరం, ఈ పదాలు భారతమాత పట్ల భక్తి, భారతమాత పట్ల ఆరాధన. వందేమాతరం, ఈ పదాలు మనల్ని చరిత్రలోకి తీసుకెళ్తాయి, అవి మన వర్తమానాన్ని కొత్త ఆత్మవిశ్వాసంతో నింపుతాయి. సాధించలేని సంకల్పం లేదని, మనం భారతీయులు సాధించలేని లక్ష్యం లేదని మన భవిష్యత్తుకు కొత్త ధైర్యాన్ని ఇస్తాయి” అని ప్రధాని మోదీ అన్నారు. వందేమాతరం ఈ సామూహిక గానం అద్భుతమైన అనుభవం నిజంగా వ్యక్తీకరణకు మించినది. చాలా స్వరాలు, ఒక లయ, ఒక స్వరం, ఒక భావోద్వేగం, ఒక థ్రిల్, ఒక ప్రవాహం, అంత పొందిక, అంత అల.. ఈ శక్తి హృదయాన్ని ఉప్పొంగేలా చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
వందేమాతరం గేయాన్ని నవంబరు 7, 1875న బంకించంద్ర ఛటర్జీ రచించారు. ఈ గేయం.. తొలిసారి ఛటర్జీ రాసిన ‘ఆనంద్ మఠ్’ నవలలో ప్రచురితమైంది. 1905… అక్టోబర్ 16. ఆ రోజు శ్రావణ పౌర్ణమి… రక్షా బంధన్. ఆంగ్లేయులు బెంగాల్ విభజనని అమలు చేసిన రోజు! తెల్లవారి నిర్ణయానికి వ్యతిరేకంగా కోల్‌కతా ప్రజానీకం టౌన్‌హాల్ దగ్గర పెద్ద ఎత్తున గుమికూడింది. ఆ సమూహానికి ఠాగూర్ నేతృత్వం వహించారు. అమ్మాయిలు తమ సోదరులకి రక్షాబంధన్ కట్టే పద్ధతినే కాస్త మార్చి.. హిందూ-ముస్లింలు ఒకరికొకరు రాఖీలు కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా దేశమాతని స్మరించుకునేలా ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించారు. ఆయన్ని అనుసరిస్తూ… వీధివీధినా ‘వందేమాతరం’ నినాదాలు చేశారు. చూస్తుండగానే అది మంత్రమైంది… మహోపదేశమైంది. బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా ‘స్వదేశీ ఉద్యమాన్ని’ మొదలుపెట్టిన కాంగ్రెస్ నేతలు ఆ పాటని అపురూపంగా అందుకున్నారు. ముఖ్యంగా బిపిన్ చంద్రపాల్ వందేమాతర గీతాన్ని దేశానికంతా పరిచయం చేశారు.
వందేమాతరం నినాదాన్నీ, గేయాన్నీ వాయువేగంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా తీసుకెళ్లారు బెంగాలీ విప్లవకారులు. వివిధ భాషల్లో కరపత్రాలుగా ముద్రించి పంచారు. అదే పేరుతో పత్రికలూ నడిపారు. ఆ సాయుధ దళాల ముఖ్యనేత అరవింద్ ఘోష్ మొదటిసారిగా వందేమాతర గీతాన్ని ఇంగ్లిషులోకి అనువదించారు. ఆ ప్రతి 1905-1907 మధ్య దక్షిణాది భాషలన్నింటిలోకీ తర్జుమా అయ్యింది. 1906లో పాథేఫోన్స్ కంపెనీ దాన్ని గ్రామఫోన్ రికార్డుగా తీసుకొచ్చింది. మరో ఏడాది తర్వాత కానీ, బ్రిటిష్ పాలకులు ఆ గేయ తీవ్రతను గ్రహించలేకపోయారు.
‘ఆనందమఠ్’ నవలలో భాగమైన వందేమాతరం గీతంలోని చివరి పాదాల్లో ప్రస్తావించిన దుర్గమ్మను మృత్యుదేవతగా అభివర్ణించుకున్నారు. అందులోని ‘రాక్షసులు’ అనే మాటను తమకు అన్వయించున్నారు. ఆ పాటపైన నిషేధాజ్ఞలు విధించారు. ఆ నిరంకుశమైన నిర్ణయం భారతీయుల్లో ఆగ్రహాన్ని పెంచింది. కార్మికులూ కర్షకులూ రైతులూ మహిళలూ.. ఒకరేమిటి, సమస్త ప్రజానీకం పోరాటయోధులుగా మారారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో 1905-11 మధ్య కాలాన్ని ‘వందేమాతర యుగం’ అంటున్నా, ఆ ప్రభావం 1947 వరకూ మహోజ్జ్వలంగా కొనసాగింది.
అది 1907వ సంవత్సరం. ఫిబ్రవరిలో ‘వందేమాతరం’ గీతం రాజమహేంద్రి యువతని తొలిసారిగా ఉద్యమం వైపు నడిపించింది. అక్కడి విద్యార్థులు ఆ గీతాన్ని ఎలుగెత్తి పాడుతూ ఊరేగింపుగా నడిచారు. ఆర్ట్స్ కాలేజీ విద్యార్థి గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆ బృందానికి నాయకుడు. ఈ పరిణామాన్ని ప్రిన్సిపల్ హంటర్ సహించలేకపోయాడు. విద్యార్థులకు ఓ హెచ్చరికగా… హరిసర్వోత్తమరావుని కాలేజీ నుంచి బహిష్కరించాడు. అయన, ఎవరూ బెదరలేదు. మరింత పట్టుదలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. నెల రోజుల తర్వాత, బెంగాల్ నుంచి బిపిన్ చంద్రపాల్ స్వయంగా అక్కడికి వచ్చారు. ఆయనకి హరిసర్వోత్తమరావే స్వాగత పత్రం అందజేశారు. ఆ పరిణామంతో మరింత రెచ్చిపోయిన హంటర్… హరిసర్వోత్తమరావుకి ఎక్కడా ఉద్యోగం రాకుండా మద్రాసు ప్రెసిడెన్సీ అధికారుల నుంచి ప్రత్యేక ఆదేశాలు తెప్పించాడు. దాంతో.. అప్పటిదాకా కొద్దిమందికే పరిమితమైన ఉద్యమంలోకి విద్యార్థిలోకమంతా ఉత్సాహంగా దూకింది. హంటర్ 138 మందిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చాడు. ఆ నిర్ణయంతో రాజమహేంద్రవరం అట్టుడికిపోయింది. ఆంగ్లేయులు ఎక్కడ కనిపించినా… ‘వందేమాతరం!’ అంటూ నిరసన తెలపడం నిత్యకృత్యమైంది. ఆ వేడి కోటప్పకొండ తిరునాళ్ల దాకా పాకింది.
1906లో పాథేఫోన్స్ కంపెనీ వందేమాతర గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గళంలో గ్రామఫోన్ రికార్డుగా తెచ్చింది. ఆ తర్వాతి సంవత్సరమే ఆ కాపీలన్నింటినీ బ్రిటిష్ పోలీసులు ధ్వంసం చేసేశారు. దానికి సంబంధించిన ఒరిజినల్ ప్రతి చాలారోజులు పారిస్‌లోనే ఉండిపోయింది. 1966లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని మళ్లీ కాపీచేయించి మనదేశానికి తెప్పించారు. 1947 ఆగస్టు 15… మనకు స్వాతంత్య్రం సిద్ధించిన రోజున ప్రఖ్యాత సంగీతకారుడు ఓమ్‌ప్రకాశ్ వందేమాతర గీతాన్ని పార్లమెంటులో ఆలపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..