Uttar Pradesh: 28 ఏళ్ల క్రితం చనిపోయిన గేదె.. 83 ఏళ్ల వ్యక్తికి అరెస్ట్ వారెంట్ జారీ..

|

Jun 27, 2023 | 2:10 PM

83 ఏళ్ల వృద్ధికి అరెస్ట్ వారెంట్ జారీ.. ఇంటికి వచ్చి స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. పక్షవాతంతో ఇబ్బంది పడుతున్న వృద్ధుడు.. ఏం జరుగుతుందో అర్థం కాక చుట్టూ జనాలు.. బోరున విలపించిన వృద్ధుడు.. ఇంతకీ అతన్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు?

Uttar Pradesh: 28 ఏళ్ల క్రితం చనిపోయిన గేదె.. 83 ఏళ్ల వ్యక్తికి అరెస్ట్ వారెంట్ జారీ..
Old Man
Follow us on

83 ఏళ్ల వృద్ధికి అరెస్ట్ వారెంట్ జారీ.. ఇంటికి వచ్చి స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. పక్షవాతంతో ఇబ్బంది పడుతున్న వృద్ధుడు.. ఏం జరుగుతుందో అర్థం కాక చుట్టూ జనాలు.. బోరున విలపించిన వృద్ధుడు.. ఇంతకీ అతన్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? అంటే ఈయన వాహనం బర్రెను గుద్దడంతో అది చనిపోయింది. అది కూడా 28 ఏళ్ల క్రితం జరిగింది. ఈ కేసు ఇప్పుడు బెంచ్‌మీదకు రావడంతో.. అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ధర్మాసనం. దాంతో పక్షవాత బాధితుడైనా.. పోలీసులు అరెస్ట్ చేయక తప్పలేదు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బారాబంకీలోని దయానంద్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ వెనుక నివాసం ఉండే మునవ్వర్ కైసర్‌బాగ్ డిపోలో డ్రైవర్‌గా పని చేసేవాడు. ఆ తరువాత చార్‌బాగ్, బారాబంకి డిపోలలోనూ డ్రైవర్‌గా విధులు నిర్వహించాడు. అయితే, 1994 సంవత్సరంలో కైసర్‌బాగ్ డిపో నుంచి బస్సులో లక్నో నుంచి బరేలీ, ఫరీద్‌పూర్‌కు వెళ్తున్నాడు. ఆ సమయంలో ఓ గేదె వారి బస్సు ముందుకు అకస్మాత్తుగా దూసుకొచ్చింది. దాంతో బస్సు ఆ బర్రెను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బర్రె మృతి చెందింది. ఫరీద్‌పూర్‌ పీఎస్‌లో ఈ ప్రమాదంపై కేసు నమోదైంది. ఆ కేసు అలాగే కొనసాగగా.. అతను ఉద్యోగం నుంచి పదవీ విరమణ కూడా తీసుకున్నాడు. ఇంతకాలం అంతా సజావుగానే ఉన్నారు.

సోమవారం హఠాత్తుగా ఫరీద్‌పూర్ పోలీస్ స్టేషన్‌ నుంచి ఎస్ఐ విజయ్‌పాల్ వచ్చి ఆ వృద్ధుడికి అరెస్ట్ వారెంట్ చూపించారు. దాంతో ఆ వృద్ధుడు సహా ఇంటి సభ్యులు అవాక్కయ్యారు. వారెంట్ చూసి పోలీసు ఎదుట బోరున ఏడ్చాడు వృద్దుడు. పక్షవాతంతో బాధపడుతున్నా సరే తప్పనిసరిగా కోర్టుకు హాజరవ్వాల్సిందేనని, లేదంటే బలవతంగా అరెస్ట్ చేయాల్సి వస్తుందని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ వ్యవహారం ఇప్పుడు స్థానికంగా ఆసక్తిరేపుతోంది. మరి ధర్మాసనం ఏం తీర్పు ఇస్తుంది? అతన్ని అరెస్ట్ చేస్తారా? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..