
నవజాత శిశువుకు తల్లి పాలు ఉత్తమ ఆహారం. కానీ, ఇప్పుడు అవే విషంగా మారే ప్రమాదం ముంచుకోస్తోంది. తాజా పరిశోధనలో తల్లి పాలలో యురేనియం (U-238) ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లో వెలుగు చూసింది. బీహార్‌లోని 6 జిల్లాల్లో జరిగిన పరిశోధనలో 40 మంది బాలింతల తల్లిపాలలో యురేనియం (U-238) ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ యురేనియం స్థాయిలు తక్కువగా ఉన్నప్పటికీ, శిశువులు దీర్ఘకాలంలో క్యాన్సరేతర సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.
చాలా కాలంగా భూగర్భ జలాల్లో ఉన్న ఈ విషపూరిత మూలకం నవజాత శిశువుల శరీరాలకు నేరుగా చేరుకుంటుందని చెబుతున్నారు. అయితే, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారి ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అధ్యయనంలో పేర్కొన్న యురేనియం నమూనాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించదగిన పరిమితి కంటే తక్కువగానే ఉన్నాయన్నారు.
ఈ పరిశోధనను పాట్నాకు చెందిన మహావీర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుండి డాక్టర్ అరుణ్ కుమార్, ప్రొఫెసర్ అశోక్ ఘోష్ నేతృత్వంలోని బృందం నిర్వహించింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన డాక్టర్ అశోక్ శర్మ, అతని బృందం కూడా ఇందులో పాల్గొన్నారు.
6 జిల్లాల నుండి 40 మంది తల్లుల పాల నమూనాలను పరీక్షించారు. అక్టోబర్ 2021, జూలై 2024 మధ్య నిర్వహించిన ఈ అధ్యయనంలో, భోజ్‌పూర్, సమస్తిపూర్, బెగుసరాయ్, ఖగారియా, కతిహార్, నలంద నుండి 17–35 సంవత్సరాల వయస్సు గల 40 మంది తల్లుల నుండి పాల నమూనాలను సేకరించారు. అన్ని నమూనాలలో యురేనియం (U238) ఉన్నట్టుగా గుర్తించారు.. దాని స్థాయిలు 0 నుండి 5.25 µg/L వరకు ఉన్నాయి. తల్లి పాలలో యురేనియంకు ఎటువంటి సురక్షిత పరిమితి లేదు. నివేదిక ప్రకారం, దాదాపు 70 శాతం మంది శిశువులు క్యాన్సర్ కారక ఆరోగ్య ప్రమాదాలను కలిగించే స్థాయిలలో యురేనియంకు గురయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..