Amit Shah talking to Tamil Nadu and Kerala CMs: దక్షిణ భారతాన్ని తుఫానులు విడిచిపెట్టడం లేదు. మొన్నటి వరకు నివర్ తుఫాన్ రాష్ట్రాలను అల్లకల్లోలం చేసింది. దాని ఎఫెక్ట్ నుంచి కోలుకోకముందే మరోసారి బురేవి తుఫాన్ వచ్చిపడింది. దీంతో రాష్ట్రాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం మరింత బలపడి ‘బురేవి’ తుఫాన్‌గా మారింది. ఇది శ్రీలంకలోని ట్రింకోమలై ప్రాంతానికి తూర్పు ఈశాన్యంగా 70 కిలోమీటర్లు, తమిళనాడులోని పాంబన్‌కు తూర్పు ఆగ్నేయంగా 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై పొంచి ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపట్టి ప్రజలను ఆదుకోవాలి.
మరోవైపు బురేవి తుఫాన్ గురించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజన్‌తో తుఫాన్ గురించి ఫోన్‌లో మాట్లాడారు. మూడు రాష్ట్రాల ప్రజలకు సహాయం చేయడానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రాలకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించామని తెలిపారు. వెంటనే రక్షణ చర్యలు ప్రారంభించాలని సూచించారు. ఇక ఏపీలో రేపటి వరకు తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు సూచించారు.