
దేశ ఆర్థిక భవిష్యత్తును ఆవిష్కరించే కేంద్ర బడ్జెట్ 2026కు ముహూర్తం ఖరారైంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1నపార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా సెలవు రోజైనప్పటికీ, బడ్జెట్ సంప్రదాయం ప్రకారం ఆదివారం కూడా సభ కొనసాగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించనున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 28l పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. జనవరి 29న దేశ ఆర్థిక స్థితిగతులను వివరించే ఆర్థిక సర్వేను ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సమర్పిస్తారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు.
ఈసారి బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా సాగనున్నాయి. వీటిని రెండు దశలుగా విభజించారు. మొదటి దశ జనవరి 28న ప్రారంభమై ఫిబ్రవరి 13తో ముగుస్తుంది. రెండవ దశ స్వల్ప విరామం తర్వాత మార్చి 9న ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు కొనసాగుతుంది.
ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో వికసిత్ భారత్ లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పులు ఉంటాయని వేతన జీవులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రైల్వే, రహదారులు, రక్షణ రంగాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. రైతుల ఆదాయం పెంపుదల, గ్రామీణ ఉపాధి పథకాలపై ప్రత్యేక దృష్టి సారించవచ్చని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ఈ బడ్జెట్ రూపకల్పన జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఇప్పటికే ఆర్థిక నిపుణులతో వరుస భేటీలు నిర్వహిస్తూ తుది మెరుగులు దిద్దుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..