TV9 WITT: ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్న వికసిత భారత్‌కు టీవీ9 సంపూర్ణ సహకారం

|

Feb 27, 2024 | 10:15 AM

గత మూడు రోజులుగా వినోదం నుంచి వ్యాపారం వరకు, ఆకాంక్షల నుంచి అంతరిక్షం వరకు, అనేక సమకాలీన అంశాలపై టీవీ9 సదస్సులో లోతైన చర్చలు జరిగాయి. క్రీడాకారుల నుంచి కళాకారుల వరకు, కేంద్రమంత్రుల నుంచి వ్యాపార దిగ్గజాల వరకు, ఈ అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సులో దేశ విదేశీ ప్రముఖులు అనేక మంది పాల్గొన్నారు. దేశాన్ని అత్యంత ప్రభావితం చేసే ఈ అంశాలపై టీవీ 9 నిర్వహించిన వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే సదస్సు చర్చించింది.

TV9 WITT: ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్న వికసిత భారత్‌కు టీవీ9 సంపూర్ణ సహకారం
Pm Modi Ramu Rao Barun Das
Follow us on

భారతదేశపు అతి పెద్ద న్యూస్‌ నెట్‌వర్క్‌ టీవీనైన్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వాట్‌ ఇండియా థింక్స్ టుడే శిఖరాగ్ర సదస్సులో సమకాలీన అంశాలే కాదు, భారతదేశం గురించి ప్రపంచం ఏం ఆలోచిస్తోంది, భారతదేశం ముందుకు వెళ్తున్న తీరు, ఆ వేగాన్ని నిలిపి ఉంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఇలా అనేక సమకాలీన అంశాలపై అనేక మంది అతిరథ మహారధులు, పరిశ్రమ దిగ్గజాలు పాల్గొంటున్నారు. రెండో రోజు సమావేశంలో అనేక అంశాలపై అత్యంత ఆసక్తిదాయక చర్చ జరిగింది.

వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే శిఖరాగ్ర సదస్సు రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఢిల్లీ అశోకా హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీని మైహోమ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ రామేశ్వరరావు, మైహోమ్‌ గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్ రాము రావు, టీవీ9 గ్రూప్‌ ఎండీ, సీఈఓ బరుణ్‌దాస్‌ తోడ్కొని వచ్చారు. అనంతరం సభా వేదికను ప్రారంభిస్తూ ప్రధాని మోదీకి మైహోమ్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటీవ్ వైస్‌ ఛైర్మన్‌ రాము రావు స్వాగతం పలికారు. ప్రధాని ఆకాంక్షిస్తున్న వికసిత భారత్‌కు టీవీ9 సంపూర్ణ సహకారం అందిస్తుందని రాము రావు ప్రతిజ్ఞ చేశారు.

దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మనస్సులు గెలుచుకున్న వ్యక్తి ప్రధాని మోదీ అని రాము రావు అన్నారు. ఆయన కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక స్ఫూర్తి, ఆయన ఒక దార్శనికుడు, ఆయన ఒక ప్రపంచ నాయకుడు. నవభారత తరానికి ఆయన ఒక స్ఫూర్తి అన్నారు. యువతతో మోదీ అనుసంధానమయ్యే తీరు అసమానం. యువత ఆకాంక్షలు, ఎదుర్కొనే సవాళ్లు, కనే కలలను ఆయన లోతుగా అర్థం చేసుకుంటారని తెలిపారు. అంకితభావంతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని యువత అర్థం చేసుకునేందుకు ప్రధాని మోదీ ఒక నిలువెత్తు ఉదాహరణ అంటూ పేర్కొన్నారు రాము రావు.

ఈ సందర్భంగా టీవీ9 ఎండీ, సీఈఓ బరుణ్‌దాస్ వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే సదస్సు ఉద్దేశాలు వివరించారు. ప్రధాని మోదీ నవభారత రూపశిల్పి మాత్రమే కాదు, రానున్న వెయ్యేళ్లకు పునాదులు వేయాలని కోరుకునే వ్యక్తి అన్నారు బరుణ్ దాస్. ప్రస్తుతం మనం ఉన్న ప్రజాస్వామ్యంలో నాయకులు చాలా సందర్భాల్లో పూర్తి కాలం పదవిలో ఉండలేకపోతున్నారు. కాని మోదీ దార్శనికత కేవలం దశాబ్దకాలానికే కాదు ఒక సహస్రాబ్ది వరకు నిలిచిపోతుందన్నారు.

కాగా టీవీ9 చేపట్టిన ఈ మహాత్తర కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. భారతదేశ వైవిధ్యానికి టీవీ 9 న్యూస్‌ రూమ్‌ ప్రతిబింబంగా నిలుస్తుందని ప్రధాని మోదీ ప్రశంసించారు. టీవీ9కు అనేక భారతీయ భాషల్లో వేదికలున్నాయి. భారతదేశ వికసిత ప్రజాస్వామ్యానికి టీవీ9 ప్రతిబింబం కూడా. వివిధ భాషల్లో పనిచేస్తున్న టీవీ9 సిబ్బంది, టెక్నికల్‌ టీమ్‌కు అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ. ఇవాళ్టి చర్చ కోసం టీవీ9 చాలా ఆసక్తికరమైన అంశం India poised for the Next Big Leap ఎంచుకుంది. ఆ పెద్ద అడుగు అన్నది మనం ఉత్సాహంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుందన్నారు ప్రధాని. వ్యక్తి కాని దేశం కాని నిరాశా నిస్పృహల్లో ఉన్నప్పుడు ఆ పెద్ద అడుగు గురించి ఆలోచనే చేయలేరన్నారు.

తన ప్రసంగంలో ప్రధాని మోదీ గతంలో భారతదేశాన్ని ప్రస్తుత భారత్‌ను పోల్చి చూపారు. అనేక గణాంకాలను ఆయన అలవోకగా ప్రస్తావించారు. దేశ ఆకాంక్షలేంటి, ముందుకు సాగేందుకు కనిపిస్తున్న ఉత్సాహంలో ఏముందో వివరించారు. భారత్‌ నేడు ముందడుగు వేసేందుకు గడిచిన పదేళ్ల పాలన ఒక లాంచ్‌ప్యాడ్‌గా నిలిచిందని ప్రధాని మోదీ తెలిపారు. పదేళ్ల తమ పాలనలో దేశం ఎలాంటి మార్పులు చూసిందో వివరించారు. “భారత్ మొదటి, రెండు, మూడో పారిశ్రామిక విప్లవంలో వెనుకబడిపోయాం. ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవంలో ప్రపంచానికి భారత్‌ నాయకత్వం వహించాలి. ఆ దిశగా ప్రతీ నిత్యం జరుగుతున్న అభివృద్ధి పనులతో భారత్‌కు నూతనశక్తి లభిస్తోంది. దేశంలో ప్రతీ రోజు రెండు కాలేజీలు ప్రారంభమయ్యాయి. ప్రతీ వారం ఒక యూనివర్సిటీ ప్రారంభమైంది. ప్రతీ రోజు 55 పేటెంట్లు, 600 ట్రేడ్‌మార్కులు రిజిస్టర్‌ అయ్యాయి. ప్రతీ రోజు 1.50 లక్షల రూపాయల ముద్ర రుణాల పంపిణీ జరిగింది. దేశంలో ప్రతీ రోజు 37 కొత్త స్టార్టప్స్‌ వచ్చాయి. దేశంలో నిత్యం 16వేల కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. దేశంలో ప్రతీ రోజు మూడు కొత్త జనౌషధి కేంద్రాలు తెరుచుకున్నాయి. ప్రతీ రోజు 14 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ నిర్మాణం జరిగింది. ప్రతీ రోజు 50 వేల కంటే ఎక్కువ ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్లు మంజూరయ్యాయి. ప్రతీ సెకనకు ఒక హర్‌ ఘర్‌కో జల్‌ కనక్షన్‌ ఇచ్చాం. భారతదేశంలో ప్రతీ రోజు 75 వేల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించాం.” అంటూ చెప్పుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ.

గతంలో ప్రభుత్వాలు దేశ డీఎన్‌ఎను చంపేశాయని ప్రధాని మోదీ అన్నారు. కుంభకోణాలు, అవినీతితో నాటి పాలన స్తంభించిపోయిందని విమర్శించారు. ఈ పదేళ్లలో ఆ వ్యవస్థను సమూలంగా మార్చేశామని ప్రధాని మోదీ ప్రకటించారు. “దేశం ఇలాగే నడిచిపోతుందని వాళ్లు అనుకున్నారు. దానికి తోడు అవినీతి, వేల కోట్ల రూపాయల కుంభకోణాలు, విధాన పక్షవాతం, వారసత్వ రాజకీయాలు దేశ డీఎన్‌ఎను నాశనం చేశాయి. గడిచిన పదేళ్లలో ఆ భయానక స్థితి నుంచి దేశాన్ని ముందుకు తీసుకొచ్చాం. గడిచిన పదేళ్లలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ టాప్‌ ఫైవ్‌లోకి వచ్చింది. దేశంలో నేడు అవసరమైన విధానాలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. నిర్ణయాలు కూడా అంతే వేగంగా తీసుకోవడం జరుగుతోంది. మైండ్‌సెట్‌లో వచ్చిన మార్పులు అద్భుతాలు తీసుకొచ్చాయి.” అని అన్నారు ప్రధాని మోదీ.

గత పాలకులకు భారతీయుల శక్తి సామర్ధ్యాలపై నమ్మకం లేదని ప్రధాని మోదీ అన్నారు. వాటిని తక్కువ అంచనా వేశారని విమర్శించారు. భారతీయులు నిరాశావాదులని ఎర్రకోట సాక్షిగా అప్పట్లో చెప్పారని గుర్తు చేశారు. ఓటమి భావనను అందిపుచ్చుకున్నారని అన్నారు. భారతీయులు సోమరులను ఎర్రకోట నుంచి గత పాలకులు చెప్పిన విషయాన్ని ప్రధాని ఎంతో ఆవేదనతో చెప్పారు. “మా ప్రభుత్వం దేశం ముందు అనే భావనకు ప్రాధాన్యమిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఏం పని చేయకపోవడమే గత ప్రభుత్వాలకు చాలా తేలికైన పనిగా ఉండేది. ఆ వర్క్ కల్చర్‌తో దేశనిర్మాణం జరగదు, దేశమూ ముందుకెళ్లదు.” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

వచ్చే ఐదేళ్ల కాలం భారతదేశానికి ఎంతో కీలకమని ప్రధాని మోదీ అన్నారు. దేశ ఆకాంక్షలను తాము తమ మూడో పరిపాలన కాలంలో కచ్చితంగా నెరవేర్చుతామని టీవీ9 వేదికగా ప్రధాని మోదీ ప్రకటించారు. “ఇవాళ అందరూ అంటున్నారు ఇండియా ఈజ్‌ ది ఫ్యూచర్‌ అని. రానున్న సమయం చాలా కీలకమైనది. వచ్చే ఐదేళ్లు అత్యంత కీలకమైనవి. ఇక్కడ కూర్చున్న అందరి ముందు నేను చెప్తున్నాను, వచ్చే మా మూడో పాలనలో భారతదేశ శక్తిసామర్ధ్యాలను కొత్త ఎత్తుకు తీసుకెళ్లాలి. వికసిత భారత లక్ష్యంలో రానున్న ఐదేళ్ల కాలం మన దేశ ప్రగతి, ప్రశస్తికి కీలక సమయం. ఈ సెమినార్‌, జరిగినా జరగకపోయినా నేను ఎంతో విశ్వాసంతో చెప్తున్నాను కచ్చితంగా పెద్ద అడుగు మాత్రం పడుతుంది.” అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

ఆర్టికల్‌ 370 రద్దు నుంచి మొదలుపెట్టి రామాలయ నిర్మాణం వరకు, ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు నుంచి మహిళా రిజర్వేషన్‌ వరకు, వన్‌ ర్యాంక్‌ వన్ పెన్షన్‌ నుంచి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్ స్టాఫ్‌ వరకు అన్ని నిర్ణయాలు దేశం ముందు అనే భావనతో తీసుకుందని ప్రధాని మోదీ తెలిపారు. గత ప్రభుత్వాలు అసంపూర్ణంగా వదిలేసిన ఎన్నో పనులను తాము పూర్తి చేశామని వెల్లడించారు. 21వ శతాబ్దపు రాబోయే రోజుల కోసం కూడా భారత్‌ను మనమే సిద్ధం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. స్పేస్‌ నుంచి సెమీ కండక్టర్‌ వరకు, డిజిటల్‌ నుంచి డ్రోన్ వరకు, AI నుంచి క్లీన్ ఎనర్జీ వరకు, 5G నుంచి ఫిన్‌టెక్‌ వరకు అన్ని రంగాల్లో భారతదేశం నేడు ముందు వరుసలో నిలుస్తోందని ప్రధాని మోదీ టీవీ9 వేదికగా ప్రకటించారు.

గత మూడు రోజులుగా వినోదం నుంచి వ్యాపారం వరకు, ఆకాంక్షల నుంచి అంతరిక్షం వరకు, అనేక సమకాలీన అంశాలపై టీవీ9 సదస్సులో లోతైన చర్చలు జరిగాయి. క్రీడాకారుల నుంచి కళాకారుల వరకు, కేంద్రమంత్రుల నుంచి వ్యాపార దిగ్గజాల వరకు, ఈ అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సులో దేశ విదేశీ ప్రముఖులు అనేక మంది పాల్గొన్నారు. దేశాన్ని అత్యంత ప్రభావితం చేసే ఈ అంశాలపై టీవీ నైన్‌ నిర్వహించిన వాట్‌ ఇండియా థింక్స్‌ టుడే సదస్సు చర్చించింది.

భారత్ ఆలోచనలు, ఆకాంక్షలను టీవీ9 శిఖరాగ్ర సదస్సు Live కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…