Harrasing wild Elephants: తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో తిరుమూర్తి ఆనకట్ట సమీపంలోని అటవీ ప్రాంతంలో కొంతమంది గిరిజన యువకులు అడవి ఏనుగులను వేధిస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. కొంతమంది గిరిజన యువకులు రాళ్లతో కొట్టడం, కుక్కలతో వెంబడిస్తూ ఏనుగులను వేధిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.
అటవీ ప్రాంతంలోని నిషేధిత భూభాగంలో గిరిజన యువకులు ఏనుగులను వేధిస్తున్నట్లు అధికారులకు సమాచారం తెలిసింది. వెంటనే తిరుపూర్ జిల్లా అటవీ అధికారులు ముగ్గురు గిరిజన యువకులపై కేసు నమోదు చేశారు. అడవి ఏనుగును ఆటపట్టించినందుకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వారిపై కేసు నమోదైంది. ముగ్గురు యువకులను త్వరలో రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.
కోపంతో ఉన్న జంతువులపై అనేక మంది యువకులు వెంటాడటం, రాళ్ళతో కొట్టడం దారుణమన్నారు. మరికొందరు చెట్ల కొమ్మలపై కూర్చొని ఏనుగులను ఆటపట్టిస్తున్నట్లు తెలిసింది. ఏనుగులు అటవీప్రాంతంలోకి పరుగెత్తడానికి ప్రయత్నించినప్పుడు యువకులు వాటిని రాళ్లతో కొట్టారని వీడియోల ద్వారా తెలిసింది. అడవి జంతువులను వేధిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు గిరిజనులను హెచ్చరించారు.