మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు చేతికందిన ఏ అవకాశాన్నీ ప్రధాన పార్టీల నేతలు వదులుకోవడం లేదు. శివసేన, బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు నిత్యం వాడివేడి విమర్శనాస్త్రాలతో ప్రత్యర్థులపై విరుచుకపడుతున్నారు. తాజాగా ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ‘రైలు ఇంజిన్, కోచ్‌లు’ అంశం హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ రాజకీయాలకు రైలు ఇంజిన్, కోచ్‌లతో సంబంధమేంటని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
మొన్న ఆ మధ్య అధికార శివసేన, ఎన్సీపీ నేతలకు కోపం తెప్పిస్తూ మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో జరిగే తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, తానే సీఎం అభ్యర్థినంటూ ఆయన ప్రకటించుకున్నారు. ఆయన వ్యాఖ్యలపై శివసేన నేతలు తీవ్రస్థాయిలోనే కౌంటర్ ఇచ్చారు. తాజాగా కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేర్పులపై నానా పటోల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మార్చాల్సింది కోచ్‌లు కాదు…రైలు ఇంజిన్‌నే అంటూ తనదైన శైలిలో ఆయన ప్రధాని మోడీపై విరుచుకపడ్డారు. గత ఏడేళ్లలో జరిగిన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేశారంటూ ఆయన ఆరోపించారు. మంత్రులను మార్చినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదని..ఇంజిన్(ప్రధాని నరేంద్ర మోడీ) పాడైనందున దాన్నే మార్చాలన్నారు.
అయితే రైలు ఇంజిన్ మార్చాలంటూ నానా పటోల్ చేసిన వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఏ రైలు ఇంజిన్ గురించి మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ రైలు ఇంజిన్ గురించేనా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇంజిన్ నిజంగానే పాడైయ్యిందని..జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రంలోనూ వెంటనే ఇంజిన్ మార్చాల్సిన అవసరం ఉందంటూ ఎద్దేవా చేశారు. ఆ రకాంగా మహారాష్ట్ర రాజకీయాల్లో ‘రైలు ఇంజిన్, కోచ్‌లు’ హాట్ టాపిక్ అయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇలా విమర్శలు చేసుకోవడాన్ని రాజకీయ వర్గాలతో పాటు సామాన్య జనానికి ఆసక్తి కలిగిస్తోంది.
Also Read..
అసెంబ్లీ సీట్ల పెంపు వివాదం.. కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ ఎంపీ వినోద్ కుమార్..
కార్యకర్త చెంప చెల్లుమనిపించిన కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్.. వైరలవుతోన్న వీడియో