Tomato Virus: ప్రకృతి అందాలతో అలరించే కేరళ రాష్ట్రాన్ని రకరకాల వైరస్ లు వణికిస్తున్నాయి. దేశంలోనే కరోనా వైరస్ మొదటి కేసు.. కేరళలో నమోదు కాగా.. ఇక్కడ బర్ద్ ఫ్లూ, నిఫా వైరస్ వంటి కేసులు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కేరళలో మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. టమాటా ఫ్లూ అనే ఒక వైరస్ రాష్ట్రంలో వేగంగా వ్యాపిస్తూ.. ప్రజలు భయాందోళనకు గురి చేస్తోంది. 5 ఏళ్ల లోపు చిన్నారులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో బాధిత చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
టమోటా ఫ్లూ వల్ల చేతులు, కాళ్లు, మూతిపై ఎర్రటి దద్దలు వస్తాయని తెలిపారు వైద్య నిపుణులు. ప్రస్తుతం కేరళలోని కొల్లామ్‌లో ఈ కొత్త రకం కేసులు నమోదైన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 82 మంది చిన్నారులకు ఈ వైరస్ బారిన పడ్డారు. కోవిడ్ ఫోర్త్ వేవ్ సమయంలో టమోటా ఫ్లూ లేదా టమోటా ఫీవర్ ఇండియాలో వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురి అవుతున్నారు ప్రజలు. అయితే ముఖ్యంగా అయిదేళ్లలోపు చిన్నారుల్లో ఈ వైరస్ కేసులు అధికంగా ఉన్నాయని తెలిపారు వైద్య నిపుణులు. అయితే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండే పెద్దవాళ్లలో ఆ వైరల్ లక్షణాలు కనిపించవని తెలిపారు. టమోటా ఫ్లూ లక్షణాల్లో జ్వరం, వళ్లు నొప్పులు, కీళ్ల వాపు, అలసట ఉంటుంది. కొందరు రోగుల్లో వాంతులు, విరోచనాలు, జాయింట్ పెయిన్స్ ఉంటున్నాయి. కేరళతో పాటు ఒడిశాలోనూ టమోటా ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి.
టొమాటో ఫీవర్ లేదా టొమాటో ఫ్లూ కేసులు ఎక్కువగా పిల్లల్లోనే నమోదవుతున్నాయి. ఈ వైరల్ వ్యాధి సోకిన వ్యక్తి చర్మంపై దద్దుర్లు, నిర్జలీకరణం, చర్మంపై అసౌకర్యం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇతర ఫ్లూ మాదిరిగానే టమోటా జ్వరం కూడా అంటువ్యాధి. కోవిడ్-19 మాదిరిగానే, టొమాటో జ్వరం సోకిన వ్యక్తిని ఒంటరిగా ఉంచాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. టొమాటో ఫ్లూ వ్యాప్తిని నిరోధించడంలో విశ్రాంతి, సరైన పరిశుభ్రత అవసరం. టొమాటో ఫీవర్ గురించి కొంత ఉపశమనం కలిగించే విషయం ఎందుకంటే ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు ఎలాంటి మరణాలు సంభవించలేదు. కరోనావైరస్ వలె కాకుండా, టొమాటో ఫ్లూ అంత ప్రాణాంతక వ్యాధి కాదు. అనుభవించిన చాలా లక్షణాలు తేలికపాటివి, వైరల్ వ్యాధి కారణంగా ఆసుపత్రిలో చేరిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి
ఇక కేరళలో టమాటా ఫ్లూ కేసులు రోజు రోజుకీ పెరుగుతుండడంతో.. సరిహద్దు రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. కర్ణాటక హై అలర్ట్ ప్రకటించింది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. కేరళ- తమిళనాడు సరిహద్దుల్లోని వలయార్ గ్రామంలో ప్రత్యేక వైద్యబృందాలను ఏర్పాటు చేశారు. జ్వరంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం కొయంబత్తూర్ కు వస్తున్న చిన్నారులకు తమిళనాడు వైద్యాధికారుల బృందం సరిహద్దు వద్ద పరీక్షలను నిర్వహిస్తోంది. ఒడిశాలోనూ 26 మంది చిన్నారుల్లో ఈ ఫ్లూను గుర్తించినట్లు భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వైద్య పరిశోధన కేంద్రం వివరాలు వెల్లడిస్తున్నాయని ది లాన్సెట్ పేర్కొంది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 108 కేసులు నమోదైనట్లు వెల్లడవుతోంది. కాగా కేరళ, ఒడిశా, తమిళనాడు మినహా మరే రాష్ట్రంలోనూ ఈ కేసులు బయటపడలేదని లాన్సెట్ స్పష్టం చేసింది.
మరో వైపు దేశంలో కొత్తగా 13వేల,272 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4కోట్ల43లక్షల27,890కి చేరాయి. ఇందులో 4కోట్ల36లక్షల99వేల435 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5లక్షల27వేల289 మంది మృతిచెందారు. మరో 1లక్షా వెయ్యి 166 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 36 మంది మరణించగా, 13వేల900 మంది కరోనా నుంచి బయటపడ్డారు. రోజువారీ పాజిటివిటీ రేటు 4.21 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 209.40 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వైరల్ ఫీవర్, టైఫాయిడ్ బారిన ఎక్కువ మంది పడుతున్నారు. దాంతోపాటు కరోనా కేసులు కూడా వస్తున్నాయి. గత 24 గంటల్లో 29వేల590 శాంపిల్స్ పరీక్షించారు. 435 మందికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్‌లో 199, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35, రంగారెడ్డి జిల్లాలో 29 కొత్త కేసులు వచ్చాయి. మరో 872 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. 612 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 8లక్షల30వేల815 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌తో ఇప్పటివరకు రాష్ట్రంలో 4వేల111 మంది మృతి చెందారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..