నిర్భయ దోషులకు ఉరిశిక్ష విషయంలో రోజుకో ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా.. నిర్భయ దోషులకు తీహార్ జైలు అధికారులు నోటీసులు పంపించారు. నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన దోషులు వారం రోజుల్లోగా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకోవాలని తీహార్ జైలు పాలన విభాగం సూచించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసినట్లు కారాగారం డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ పేర్కొన్నారు. ఈ గడువులోపు క్షమాభిక్షకు దాఖలు చేసుకోకపోతే.. తదుపరి చర్యలకు కోసం సుప్రీంని ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపారు.
కాగా.. బుధవారం అక్షయ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. నలుగురు నిందితులకు ఉరి శిక్షే కరెక్టని కోర్టు స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేయడంతో.. పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్‌ను వెంటనే విడుదల చేసే అవకాశం ఉంది. మరలా ఉరి శిక్ష అమలు చేయటంపై తీర్పును ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు జనవరి 7కు వాయిదా వేసింది. మరణ శిక్ష అమలు ముందుకు క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు ఇచ్చింది. ఈమేరకు తీహార్ జైలు అధికారులు నిందితులకు నోటీసులు జారీ చేశారు.
డిసెంబర్ 16వ తేదీనే నిర్భయ దోషులకు ఉరి పడుతుందని.. వార్తలు ఫుల్‌గా వైరల్ అయ్యాయి. కానీ అవి వదంతులు మాత్రమే అని తేలింది. అయితే వారికి ఎప్పుడు మరణ శిక్ష పడుతుందా అని దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు.