
భారీ వర్షాలకు తమిళనాడు వణికిపోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలో పాటు నీలగిరి, కోయంబత్తూర్, కాంచీపురం, తిరుప్పూర్, విల్లుపురం, వెల్లూరు, సాలెం, నాగపట్నం, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో తెరపిలేకుండా వానలు పడుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలోనూ వర్షం దంచికొడుతోంది. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్డేదో.. చెరువేదో తెలియనంతగా వరదలు ముంచెత్తుతున్నాయి. చెన్నైలో వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు అవడి, మనలి, పొన్నెరీ ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లళ్లోకి మోకాళ్లోతు వరద చేరి ప్రజలు అల్లాడుతున్నారు. ఇంటాబయట వరదతో ఎటెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ గడపుతున్నారు. ఇళ్లుదాటి బయటకు రాలేక.. నిత్యావసరాలు తెచ్చుకోలేక నరకం అనుభవిస్తున్నారు. అధికారులు బోట్ల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నారు.
వణికిస్తున్న వర్షాలతోనే చస్తుంటే.. పులాల్ రిజర్వాయర్ మరింత భయపెడుతోంది. చంబరపాకం రిజర్వాయర్ నిండుకుండలా మారడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు.. ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయంతో బతుకీడుస్తున్నారు. భారీవర్షాలకు చెన్నైలో ఇప్పటికే సబ్‌వేలను మూసివేశారు. తిరుత్తనిలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజపాలయంలో వరదల్లో చిక్కిన 130 మందిని సురక్షితంగా కాపాడారు అధికారులు. తాళ్ల సహాయంతో వీరిని రక్షించారు. నిత్యావసరాలను కూడా తాళ్ల సాయంతోనే అందిస్తున్నారు.
వరద భీభత్సానికి చాలా ప్రాంతాల్లో చెరువు కట్టలు తెగి రహదారులు కొట్టుకుపోయాయి. రోడ్లపై భారీగా వరదనీరు చేరింది. రోడ్డు కోతకు గురి కావడంతో పదులసంఖ్యలో గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. పంట పొలాలు నీటమునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం కూడా తమిళనాడు, పుదువై మరియు కారైకల్ ప్రాంతాలలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
#WATCH | Tamil Nadu: Places across Chennai receive moderate to heavy rainfall, visuals from Koyambedu that is experiencing heavy rainfall.
As per IMD’s forecast, Chennai to experience thunderstorm with rain today. pic.twitter.com/ZLAcjqxFnJ
— ANI (@ANI) November 13, 2022
రెడ్ అలర్ట్ జారీ చేసింది చెన్నై వాతావరణ శాఖ. ఈశాన్య రుతుపవనాలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. చెన్నై వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదికతో తెలిపింది. వారి అందించిన సమాచారం ప్రకారం.. తమిళనాడు, పుదువై, కారైకాల్‌లో పలుచోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూర్, దిండిగల్, తేని, మధురై, విరుదునగర్, తెంకాసి, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే తమిళనాడు సరిహద్దు జిల్లాలపై ఈ ప్రభావం కనిపిస్తోంది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం