Vijay: విజయ్ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్యేలతో కలిసి రాజీనామా..! ఆ పార్టీల ప్లాన్‌కు చెక్..

వెండితెరపైనే కాదు.. రాజకీయ యవనికపైనా విజయ్ తనదైన మార్క్ మాస్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. 107 మంది ఎమ్మెల్యేల రాజీనామా అస్త్రంతో అటు డీఎంకే, ఇటు ఏఐఏడీఎంకేలకు చెక్ పెడుతూ.. ప్రజలే తేల్చుకుంటారు అంటూ విజయ్ విసిరిన సవాల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. అసలు తమిళనాడులో ఏం జరగబోతోంది? అనేది తెలుసుకుందాం..

Vijay: విజయ్ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్యేలతో కలిసి రాజీనామా..! ఆ పార్టీల ప్లాన్‌కు చెక్..
Vijay Tvk 107 Mlas Ready To Resign Over Power Struggle

Updated on: May 08, 2026 | 11:09 AM

తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఎన్నడూ చూడని ఉత్కంఠభరిత మలుపులు తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే తాజాగా విసిరిన సవాల్‌తో అటు ద్రవిడ పార్టీలు, ఇటు రాజ్యాంగ నిపుణులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా అవతరించినప్పటికీ, తమను కాదని ఇతర పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే.. తమ 107 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామా చేస్తారని TVK హెచ్చరించింది. ఈ పరిణామం తమిళనాడును తీవ్ర రాజ్యాంగ సంక్షోభంలోకి నెట్టేలా కనిపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో విజయ్ పార్టీ 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. విజయ్ రెండు చోట్ల గెలవడంతో ఒక సీటు వదులుకుంటే.. ఆ పార్టీ బలం 107కి చేరుతుంది. మిత్రపక్షం కాంగ్రెస్‌తో కలిపి 112 సీట్లు ఉన్నప్పటికీ, మ్యాజిక్ ఫిగర్‌కు మరో 6 సీట్లు తక్కువగా ఉన్నాయి. ఈ గ్యాప్‌ను పూడ్చేందుకు వామపక్షాలు, ఇతర చిన్న పార్టీలతో చర్చలు జరుగుతున్న తరుణంలో.. DMK, AIADMKలు లోపాయికారీ ఒప్పందాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్న వార్తలు TVK ఆగ్రహానికి కారణమయ్యాయి.

రాజీనామా చేస్తే ఏమవుతుంది..?

ఒకవేళ టీవీకే ఎమ్మెల్యేలు 107 మంది రాజీనామా చేస్తే పరిస్థితి అదుపు తప్పుతుంది. ఆర్టికల్ 190 ప్రకారం.. రాజీనామాలు స్వచ్ఛందంగా జరిగాయో లేదో స్పీకర్ నిర్ధారించుకోవాలి. సామూహిక రాజీనామాలు కాబట్టి, ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా పిలిచి విచారించడం స్పీకర్‌కు కత్తి మీద సాము లాంటిదే. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం.. ఖాళీ అయిన 6 నెలల్లోపు ఎన్నికలు జరపాలి. ఒకేసారి 107 స్థానాలకు ఉప ఎన్నికలు అంటే అది రాష్ట్రవ్యాప్తంగా మరో మినీ జనరల్ ఎలక్షన్‌తో సమానం.

రాష్ట్రపతి పాలన తప్పదా..?

అసెంబ్లీలో సగానికి సగం మంది ఎమ్మెల్యేలు లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఏ పార్టీకీ ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని గవర్నర్ నివేదిక ఇస్తే, కేంద్రం రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయంగా పెను దుమారం రేపుతుంది. కేంద్రం నిర్ణయంపై అటు కోర్టుల్లో, ఇటు వీధుల్లో పోరాటం జరిగే అవకాశం ఉంది.

విజయ్ వ్యూహం ఏంటి..?

“ప్రజలు మాకు పట్టం కట్టారు, కానీ కుతంత్రాలతో మమ్మల్ని పక్కన పెట్టాలని చూస్తే.. మళ్లీ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం” అనే స్పష్టమైన సంకేతాన్ని విజయ్ ఇచ్చారు. 107 మందితో రాజీనామా చేయించడం అంటే.. ఇతర పార్టీలకు అధికారం దక్కకుండా చేయడంతో పాటు తనపై ఉన్న ప్రజాభిమానాన్ని మరోసారి ఓట్ల రూపంలో నిరూపించుకోవాలనేది విజయ్ ప్లాన్. తమిళనాడు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, రాజకీయ సమీకరణాలు రాష్ట్రాన్ని అనిశ్చితిలోకి నెట్టాయి. మరి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ద్రవిడ పార్టీలు విజయ్ సవాల్‌ను ఎలా ఎదుర్కొంటాయి? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రాజీనామాలు జరిగితే భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇదొక అరుదైన, సంచలన ఘట్టంగా మిగిలిపోనుంది.

Follow Us