
తమిళనాడులో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో నిరసనలు చేపట్టిన రైతులు, ఉపాధ్యాయులపై నమోదైన కేసులను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం విజయ్ ప్రకటించారు. మే 2021 నుంచి 2026 మధ్య వివిధ నిరసనల్లో పాల్గొన్న రైతులు, టీచర్లపై అనేక కేసులు నమోదయ్యాయని విజయ్ తెలిపారు. ఆ కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
రైతులను రాష్ట్రానికి “వెన్నెముక”గా అభివర్ణించిన ముఖ్యమంత్రి విజయ్.. SIPCOT పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రతిపాదిత పరందూర్ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న రైతులపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా తమ సమస్యలను వ్యక్తం చేసిన వారిపై కేసులు కొనసాగడం సరికాదని అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా తమ డిమాండ్ల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేసిన ఉపాధ్యాయులపై కూడా కేసులు నమోదయ్యాయని విజయ్ తెలిపారు. వారిపై పెండింగ్‌లో ఉన్న కేసులను కూడా ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం యాంటీ-NEET ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకునేందుకు కూడా నిర్ణయించింది.
తాజా నిర్ణయంతో రైతులు, ఉపాధ్యాయులకు భారీ ఊరట లభించనుంది. అయితే ఏ కేసులు, ఎన్ని కేసులు ఉపసంహరించనున్నారు? అనే పూర్తి వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..