
రాజస్థాన్ సంక్షోభంపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పునివ్వనుంది. సచిన్ పైలట్, ఆయన వర్గంలోని రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి స్పీకర్ సీపీ జోషీ జారీ చేసిన నోటీసును సవాలు చేస్తూ వారు సుప్రీంకోర్టుకెక్కారు. ఈ విషయంలో స్పీకర్ కు రాజ్యాంగబధ్ధ అధికారాలు ఉన్నాయా అన్న విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం తేల్చనుంది. సచిన్ వర్గం దాఖలు చేసిన పిటిషన్ పై రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన రూలింగ్ మీద స్టే జారీ చేయాలన్న స్పీకర్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. .కాగా- సుప్రీంకోర్టులో కేసును ఉపసంహరించుకోవాలని, సమస్యకు రాజకీయ పరిష్కారాన్ని కనుగొనాలని కాంగ్రెస్ పార్టీలో ఓ వర్గం కోరుతోంది. నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్ కే వదిలివేయాలన్నది వీరి సూచన..
అటు..అసెంబ్లీని ఈ నెల 31 నుంచి సమావేశపరచాలని సీఎం అశోక్ గెహ్లాట్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను కోరారు. అయితే తన విజ్ఞప్తిలో ఆయన తన బల నిరూపణ అంశాన్ని ప్రస్తావించకుండా రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితి మీద, ఆరు బిల్లులను సభలో ప్రవేశపెట్టే విషయంపైన చర్చకు గాను సభను సమావేశపరచాలని కోరడం విశేషం.